మార్చి 31వరకు సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు ఉండవ్!

  • IndiaGlitz, [Saturday,March 21 2020]

కరోనా మహమ్మారి ప్రపంచ ప్రజానీకాన్ని గజ గజ వణికిస్తోంది. ఇప్పటికే దాదాపు 250కు పైగా దేశాలకు విస్తరించిన ఈ వైరస్.. తెలుగు రాష్ట్రాలకూ పాకింది. రోజురోజుకు తెలుగు రాష్ట్రాల్లో సైతం కరోనా అనుమానిత కేసులు ఎక్కువవుతుండటంతో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశాయి. ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం థియేటర్స్, స్కూల్స్, మాల్స్ ఇలా అన్నీ మూసేయగా.. బుధవారం నాడు ఏపీ సర్కార్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికే సినిమా షూటింగ్స్, రిలీజ్‌లు ఆపేస్తున్నట్లు ఫిలిం చాంబర్ పెద్దలు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే.. మొదట మార్చి 21 వరకే అనుకున్న పెద్దలు.. తర్వాత దీన్ని ఈ నెల 31వరుకు పొడిగించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అంటే.. మరో పది రోజులపాటు సినిమా రిలీజ్‌లు, షూటింగ్స్ ఉండవన్న మాట.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మార్గదర్శకాలు, సూచనలకు అనుగుణంగా తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫిలిం చాంబర్ కార్యవర్గం ఆ ప్రకటనలో నిశితంగా వివరించింది.వెల్లడించింది. అయితే.. ఎప్పట్నుంచి షూటిగ్స్, సినిమా రిలీజ్‌లు అనే విషయంపై మరికొన్ని రోజుల్లో మరోసారి సమావేశమై పరిస్థితిపై తాజా సమీక్ష నిర్వహిస్తామని ఫిలిం చాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాగా.. ఈ ప్రకటనను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, మా ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్ & మా ఎగ్జిక్యూటివ్ కమిటీ పేరిట ప్రకటనను విడుదల చేయడం జరిగింది.