మ‌న దేశంలో ఇలాంటి నాయ‌కుడు ఉన్నాడా!?

  • IndiaGlitz, [Thursday,March 21 2019]

మెగా బ్రదర్ నాగబాబు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. ముందుగా అనుకున్నట్లుగానే ఆయన్ను ఆఖరి నిమిషంలో పవన్.. రంగంలోకి దించారు. అంతేకాదు.. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా నరసాపురం లోక్‌సభ నుంచి పోటీ చేస్తారని ఇదివరకే పెద్ద ఎత్తున వచ్చిన వార్తలు అక్షరాలా నిజమయ్యాయి. పార్టీ కండువా కప్పుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్, నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ ఏమన్నారు..!?

సోద‌రుడు నాగ‌బాబు నాకు రాజ‌కీయ గురువు. నాలో రాజ‌కీయ చైత‌న్యం నింపిన వ్యక్తి. నాగబాబును రాజమార్గంలో రాజకీయాల్లోకి తీసుకొస్తున్నా. దొడ్డిదారిన కాకుండా ప్రజాతీర్పు కోసం ధైర్యంగా ఎన్నిక‌ల ర‌ణ‌క్షేత్రంలో పోటీకి నిల‌బెడుతున్నా. నాగ‌బాబు రాజ‌కీయాల‌పై స్పష్టమైన అవ‌గాహ‌న ఉంది. ప్రజ‌ల‌కు అందుబాటులో ఉండే వ్యక్తి. అందుకే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా న‌ర‌సాపురం లోక్ స‌భ స్థానం నుంచి పోటీకి దించుతున్నాం. అన్నింటిని వదులుకుని రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా త‌న‌దైన జీవితం గడుపుతున్న వ్యక్తి.. నా ఆహ్వానం మేర‌కు రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నాను అని పవన్ తెలిపారు.

మీ అంద‌రిలా నాకూ ఆయ‌న నాయ‌కుడే..

నేను ఎత్తుకొని ఆడించిన మా త‌మ్ముడు మేమంతా ఆశ్చర్యపోయే రీతిలో ఉన్న గొప్ప నాయకుడు. మ‌న దేశంలోనే ఇలాంటి నాయ‌కుడు ఉన్నాడా..? అనే స్థాయికి ఎదిగారు. గొప్ప వ్యక్తిత్వం కల్యాణ్ బాబుకి ఉంది. ఆయ‌న వ్యక్తిత్వం జ‌న‌సేన‌లో ఉన్న చాలా మంది కంటే నాకే ఎక్కువ తెలుసు. త‌మ్ముడిని ఓ నాయ‌కుడిగా చూద్దాం అని అనుకున్నా. పార్టీలోకి ఆహ్వానించిన‌ప్పుడు న‌మ్మలేదు. పేరుకే ఆయ‌న నాకు త‌మ్ముడు. అంద‌రిలా నాకు నాయ‌కుడే. పార్టీలో చేర‌క ముందే నా నాయ‌కుడు ప‌వ‌న్‌ కోసం ఏ ప‌ని చేయ‌డానికి అయిన సిద్ధమ‌య్యాను. త‌మ్ముడు ఇచ్చిన స్ఫూర్తితో ముందుకి వెళ్తాను అని పవన్ గురించి నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.