Aroori Ramesh: తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదు: ఆరూరి రమేష్

  • IndiaGlitz, [Wednesday,March 13 2024]

తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ఆరూరి రమేష్ స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆయన సమావేశం అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారడం లేదని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్‌ను కలిసేందుకు పార్టీ నేతలతో కలిసి వచ్చానని తెలిపారు. అలాగే తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సమావేశం కాలేదని.. తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టంచేశారు.

కాగా అంతకుముందు పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరుతున్నట్లు చెప్పేందుకు హన్మకొండలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ కీలక నేతలు ఆయన ఇంటికి చేరుకున్నారు. మాజీ మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఇతర నేతలు ప్రెస్‌మీట్‌ అడ్డుకున్నారు. హరీష్‌రావు పంపిస్తే తాము వచ్చామని ఏం కోరితే అది ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉందని ఆరూరికి సర్దిచెప్పే యత్నం చేశారు. అనంతరం ఆరూరి రమేష్‌ను తీసుకుని కారులో హైదరబాద్ బయలుదేరి వెళ్లారు.

అయితే కారును ముందుకు వెళ్లనివ్వకుండా ఆరూరి అనుచరులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే జనగామ జిల్లా పెంబర్తి వద్దకు చేరుకోగానే బీజేపీ శ్రేణులు ఆరూరి ప్రయాణిస్తున్న కారును అడ్డుకుని ఆయన్ను బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఈ తోపులాటలో రమేష్ చొక్కా చిరిగిపోయింది. తమ పార్టీలే చేరేందుకు సిద్ధమైన ఆరూరిని బీఆర్ఎస్ నేతలు కిడ్నాప్ చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇలా ఉదయం నుంచి సాయంత్ర వరకు ఆరూరి రమేష్ వ్యవహరంలో పొలిటికల్ హైడ్రామా నడిచింది.

వరంగల్ ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న ఆరూరి రమేష్ బీజేపీలో చేరడానికి సిద్ధమయ్యారని జోరుగా ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన బీఆర్ఎస్ అధిస్టానం ఆయనను బుజ్జిగించే ప్రయత్నం చేస్తోంది. కేసీఆర్‌తో భేటీ అయిన అనంతరం తాను పార్టీ మారడం లేదని.. బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని ఆయన స్పష్టంచేశారు.