TRAI :ఇకపై స్పామ్ కాల్స్, సందేశాలకు చెక్.. ట్రాయ్ కీలక ఆదేశాలు

  • IndiaGlitz, [Thursday,November 09 2023]

మీరు ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు స్పామ్ కాల్స్, మెసేజెస్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీంతో కొంత అసహనానికి ఫీల్ అవుతూ ఉంటారు. ఇక నుంచి వాటికి చెక్ పడనుంది. ఈ మేరకు టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ(TRAI) కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని ప్రకారం లోన్లు, స్కీములు అంటూ బ్యాంకులు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్రమోషనల్‌ సందేశాలు పంపించాలంటే ముందుగా యూజర్‌ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఏజెన్సీ యూజర్‌కు కంటెంట్ పంపించాలీ అంటే.. ముందుగా టెలికాం ఆపరేటర్ నుంచి అనుమతి పొందాలి.

అనంతరం సదరు టెలికాం ఆపరేటర్‌ మీకు ఓ కోడ్‌తో కూడిన సందేశం పంపిస్తుంది. మీరు అనుమతి ఇస్తే మీకు కాల్స్, సందేశాలు వస్తాయి. లేదంటే నిరాకరించవచ్చు. మీరు అనుమతికి నిరాకరిస్తే టెలికాం కంపెనీ ఆ ఏజెన్సీని ఇకపై సందేశాలు పంపకుండా నిలువరించాల్సి ఉంటుంది. అలాగే ప్రమోషనల్‌ సందేశాలకు ఇచ్చిన అనుమతులను ఎప్పుడైనా సులువుగా ఉపసంహరించుకునేందుకు వీలుగా ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌ను సిద్ధం చేసుకోవాలని ట్రాయ్‌ సూచించింది.

తొలుత స్పామ్‌ సందేశాలను అరికట్టాలని భావిస్తోంది. తర్వాత కాల్స్‌కూ దీన్ని విస్తరించనుంది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే ఈ నోటిఫికేషన్‌కు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుబాటు కావని స్పష్టంచేసింది. ప్రమోషనల్‌ సందేశాలను అరికట్టడానికి డిజిటల్‌గా అనుమతి పొందేందుకు డీసీఏ(DCA) పేరిట ఓ ప్రోగ్రామ్‌ను ఇటీవల ట్రాయ్‌ తీసుకొచ్చింది.