Congress Party: ఎవరు చేరినా ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేనట్లే..
Send us your feedback to audioarticles@vaarta.com
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన పార్టీ కాంగ్రెస్. ఒకప్పుడు ఆ పార్టీ చెప్పిందే వేదం.. చేసిందే చట్టం. దేశంలోని మెజార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉండేది. కాంగ్రెస్ నాయకుడు అంటే ప్రజల్లో ప్రత్యేకమైన గౌరవం ఉండేది. అలాంటి పార్టీ కాలక్రమేణా ప్రజల విశ్వాసం కోల్పోతూ వచ్చింది. ఎంతలా అంటే ఇప్పుడు పార్టీ ఉనికి కోసమే పోరాడాల్సి వచ్చేంత. ఇప్పుడు కేవలం మూడే రాష్ట్రాల్లో అధికారంలో ఉందంటే ఆ పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొన్ని రాష్ట్రాల్లో అయితే భూస్థాపితం అయిపోయింది. అందులోనూ ముఖ్యంగా తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టిన సీమాంధ్రలో అయితే పాతాళంలోకి పడిపోయింది.
జెండా పట్టేవారే లేరు..
సమీప భవిష్యత్‌లో ఆ పార్టీ కోలుకునే పరిస్థితే లేదంటే అతిశయోక్తి కాదు. ఆ పార్టీ నుంచి పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదు. ఇక కార్యకర్తలు సంగతి సరే సరి. ఒకప్పుడు కాంగ్రెస్ జెండా పట్టుకుని కాలర్ ఎగరేసే క్యాడర్ నేడు ఆ జెండాను పట్టుకోవడానికే భయపడుతున్నారు. దీంతో పాటు దివంగత సీఎం వైఎస్సార్ మరణం తర్వాత ఆయన కుటుంబం పట్ల, ముఖ్యంగా కుమారుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన కర్కశ వైఖరిని ఏపీ ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అందుకే 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు.
నోటాకే ఓట్లు ఎక్కువ..
అంతెందుకు గతంలో కేంద్ర మంత్రులుగా పని చేసిన వాళ్లు సైతం 2014, 2019 ఎన్నికల్లో పట్టుమని పదివేల ఓట్లు కూడా సాధించలేక కుదేలైపోయారు. నోటా కన్నా కూడా తక్కువ సీట్లు తెచ్చుకుని ఘోర అవమానం ఎదుర్కొన్నారు. కేంద్ర మంత్రిగా పనిచేసిన పల్లంరాజు కాకినాడలో పోటీ చేస్తే 8,640 ఓట్లు వచ్చాయి. మరో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి నుంచి ఎంపీగా పోటీ చేస్తే కేవలం 9,585 ఓట్లు వచ్చాయి. అలాగే ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ సింగనమలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 1384 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నోటాకు 2,340 ఓట్లు రావడం గమనార్హం.
కాంగ్రెస్‌ను పైకి లేపలేరు..
ఇలా చెప్పుకుంటూ పొతే ఏ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీని కనీసం ప్రజలు గుర్తించనే లేదు. ఇక ముందు కూడా గుర్తించరు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లాంటి వాళ్లు వచ్చి పోటీ చేసినా డిపాజిట్లు కూడా రావు. అంతలా రాష్ట్రంలో ఆ పార్టీ అస్థిత్వం కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతటి గొప్ప నాయకులు ఆ పార్టీలో చేరి ముఖ్యమైన బాధ్యతలు స్వీకరించినా పార్టీని నిలబెట్టడం అసాధ్యమనే చెప్పాలి. కాబట్టి ఎవరో వచ్చి ఏదో చేస్తారనే ప్రచారం గురించి పెద్దగా పట్టించుకోని అవసరం కూడా లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments