‘నో మ్యాడ్ ల్యాండ్’కు 3 ఆస్కార్ అవార్డులు.. సినిమా కథ ఏంటంటే..
Send us your feedback to audioarticles@vaarta.com
సినీ రంగంలో ఎంతో గొప్పగా భావించే ఆస్కార్ 93వ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని రెండు ప్రాంతాల్లో నిర్వహించారు. కేవలం సినీ సెలబ్రిటీలు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ప్రముఖ దర్శకురాలు క్లోవీ చావ్ దర్శకత్వం వహించిన 'నోమడ్ ల్యాండ్' అనే ఆంగ్ల భాషా చిత్రం మూడు విభాగాల్లో(ఉత్తమ చిత్రం, దర్శకత్వం, నటి) ఆస్కార్ అవార్డులను అందుకుంది. నిజానికి దర్శకుడు క్లోవీ చావ్కి మూడు నంబర్ బాగా కలిసొచ్చినట్టుంది. ఎందుకంటే ఈ చిత్రం ఆమె దర్శకత్వం వహించిన మూడవ చిత్రం కావడం విశేషం. ‘ది ఫాదర్’, ‘మ్యాంక్’, ‘మినారి’ చిత్రాలను దాటుకుని మరీ ‘నో మ్యాడ్ ల్యాండ్’ అవార్డులను గెలుచుకుంది.
నోమ్యాడ్ ల్యాండ్ చిత్రంలో ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్, లిండా మే, డేవిడ్, స్వాంకి ప్రధాన పాత్రలు పోషించారు. 2020లో ఈ చిత్రం 108 నిమిషాల నిడివితో విడుదలైంది. కాగా.. ఈ చిత్రం ఆరు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక కాగా.. మూడు విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, దర్శకత్వం, నటి, ఆడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్ విభాగాల్లో నో మ్యాడ్ ల్యాండ్ చిత్రం ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపిక కాగా.. ఉత్తమ చిత్రం, దర్శకత్వం, నటి విభాగాల్లో ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ నటిగా రెండు సార్లు ఆస్కార్ గెలిచిన ఫ్రాన్సెస్ మెక్‌డోర్మెండ్ ప్రధానపాత్రలో నటించడంతో ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది. ‘ఫార్గో’, ‘బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబ్బింగ్, మిస్సోరి’ చిత్రాల్లో నటనకు గానూ ఆమెను ఆస్కార్ వరించింది. జెస్సికా బ్రూడర్ అనే అమెరికన్ రచయిత్రి, పాత్రికేయురాలు 2017లో రాసిన ‘నోమ్యాడ్ ల్యాండ్: సర్వైవింగ్ అమెరికా ఇన్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒకే రకమైన జీవితం, ప్రాంతంతో సంబంధం లేకుండా సంచార జీవితం గడిపేవాళ్లను నో మ్యాడ్స్ అంటారు. రోడ్డు ప్రయాణంలోనే వివిధ రకాలైన ఉద్యోగాలు చేస్తే తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు. నిజానికి క్లోవీ జావ్ చైనాలో పుట్టి పెరిగారు. అయితే ఆమె అమెరికాలోనే సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఆమె తీసిన తొలి రెండు చిత్రాలకు సైతం అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు దక్కాయి.
‘నోమ్యాడ్ ల్యాండ్’ కథ ఏంటంటే...
ఆర్థిక మాంద్యం దెబ్బకు 61 ఏళ్ల ఫెర్న్ తన భర్తతో కలిసి పనిచేసే కంపెనీ మూతపడుతుంది. ఆ తరువాత ఫెర్న్ భర్త మరణిస్తారు. ఆయన మరణంతో ఫెర్న్ జీవితంలో తీవ్ర అసంతృప్తి ఏర్పడుతుంది. సంతానం కూడా లేకపోవడంతో ఇక మీదట ఆమె సంచార జీవితాన్ని గడపాలని నిశ్చయించుకుంటుంది. ఈ క్రమంలోనే ఫెర్న్ తన ఆస్తిని అమ్మేసి ఒక వ్యాన్ కొనుక్కుంటుంది. దానికి వ్యాన్ గార్డ్ అనే పేరు పెట్టి.. కిచెన్, బెడ్ రూమ్ సహా ఇల్లులా మార్చుకొని ఆమెరికా రోడ్లపై సంచరిస్తూ సరికొత్త జీవితాన్ని మొదలుపెడుతుంది. ఇక తన వ్యాన్ గార్డ్‌లో ఫెర్న్ అమెరికాలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ.. ఆమె సందర్శించిన చోటే తన జీవనానికి అవసరమైన ఉద్యోగాన్ని వెదుక్కొని పని చేయడం చేస్తుంటుంది. ఇక సాయంత్రానికి వ్యాన్ గార్డ్‌ను ఎక్కడో ఒకచోట పార్క్ చేసి రెస్ట్ తీసుకుంటుంది. ఇలా వెళ్లిన చోట కొత్త పరిచయాలు, స్నేహాలు పెంచుకుని వారికి మళ్లీ కలుద్దామని చెప్పి వీడ్కోలు పలికి వేరే ప్రాంతానికి వెళుతుంటుంది. ఇక ఈ ప్రయాణంలో ఆమె ఎదుర్కొనే సమస్యలు ఉద్యోగం వెతుక్కోవటం, ప్రకృతి ఆటంకాలు వంటి వాటన్నింటినీ జయించి ఫెర్న్ ఎలా జీవితాన్ని కొనసాగించిందనేదే ఈ చిత్ర కథ. ఇక ఫెర్న్ కేరెక్టర్‌ను క్లోవీ జావ్ మలచిన తీరు అద్భుతం. ఆమె బయటకు చాలా ఆనందంగా కనిపిస్తున్నా.. లోలోపల ఎంత బాధపడుతుంటో ప్రేక్షకుడికి అర్థమయ్యేలా తన హావభావాలను ఫెర్న్ పలికించగలిగారు. ఆమె జీవితమంతా జ్ఞాపకాలతో నిండిపోయి ఉంటుంది. నో మ్యాడ్ జీవన వైలిలో శాశ్వత వీడ్కోలంటూ ఉండదు. తిరిగి కలుస్తామనే భావనతో ముందుకు సాగుతారు. ఫెర్న్ ప్రయాణంలో కలిసే కొన్ని పాత్రలు కన్నీళ్లు పెట్టిస్తాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments