అలీ అసంతృప్తా నో.. నో.. పక్కా ప్లాన్ ప్రకారమే!
Send us your feedback to audioarticles@vaarta.com
టాలీవుడ్ కమెడియన్, వైసీపీ నేత అలీ అసంతృప్తిలో ఉన్నాడని.. సీఎం వైఎస్ జగన్ తనకు ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో గుర్రుగా ఉన్నారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆ మధ్య ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో ప్రత్యక్షమవ్వడంతో బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడని కూడా వార్తలు వచ్చేశాయ్. అయితే తాజా పరిస్థితిని.. ఆయన మాటలను బట్టి చూస్తే అబ్బే అదేం లేదు.. అలీ అసంతృప్తికి లేడు.. ఇప్పుడే రంగంలోకి దిగేశాడని స్పష్టంగా అర్థం అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటి..? అలీ నిజంగానే రంగంలోకి దిగాడా..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
రంగంలోకి దిగుతున్నా..!
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను ఏదో ఒక పదవి వరిస్తుందని అలీ ఎన్నో కలలు కన్నాడు. అయితే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఉన్న సాన్నిహిత్యమో.. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఉండే పరిచయాల వల్లనో కానీ.. ఆయన్ను ఏ చిన్నపాటి పదవి కూడా వరించలేదు. సీన్ కట్ చేస్తే.. ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా.. టీవీ షోలు.. సినిమాలకే పరిమితం అయిపోయాడు. అంతేకాదు.. సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న సంచలన, కీలక నిర్ణయాల పట్ల ఒక్కసారంటే ఒక్కసారి కూడా మద్దతిచ్చినట్లు కానీ.. కనీసం ఆ విషయాలపైన మాట్లాడిన సందర్భాలు కూడా లేవంటే పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. అయితే తాజా పరిణామాలను బట్టి చూస్తే.. అసంతృప్తులన్నీ పోయాయ్.. ఇక రంగంలోకి దిగుతున్నా అని పరోక్షంగా అలీ సంకేతాలిచ్చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది.
ఎవర్ని ఉద్దేశించో..!?
ఇటీవల విశాఖ జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ముస్లింల ఆత్మీయ సమేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలీ విచ్చేశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు ఒకింత చర్చనీయాంశం అయ్యాయి. విశాఖ ప్రజలు మంచివారని.. చాలా ప్రేమ చూపిస్తారు కానీ తేడా వస్తే అంతే. ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారని చెప్పుకొచ్చాడు. అయితే ఇది ఎవర్నయినా ఉద్దేశించి అన్నారా..? లేకుంటే విశాఖ ప్రజలను అలా మెప్పించడానికి అన్నారా అన్నది అలీకే ఎరుక. ఈ సందర్భంగా సినిమా డైలాగ్స్ చెప్పాలని వీరాభిమానులు కోరగా.. తనదైన శైలిలో దుమ్మురేపాడు. ‘లచ్చిమీ డోంట్ టచ్‌మీ’, ‘బాగున్నారా.. బాగున్నారా’ అంటూ అలీ డైలాగ్స్ పేల్చాడు.
జగన్ కార్యక్రమాలు భేష్!
ఈ సందర్భంగా జగన్ చేపడుతున్న పథకాలు భేష్ అని అలీ కితాబిచ్చాడు. మరీ ముఖ్యంగా.. ఏపీలో ముస్లింల సంక్షేమం కోసం సీఎం ఎన్నెన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. మరీ ముఖ్యంగా హజ్ యాత్రకు వెళ్లేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ కార్యక్రమాలను ముస్లింలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అలీ కోరాడు. మొత్తానికి చూస్తే.. అలీ తాజా మాటలను బట్టి చూస్తే.. అబ్బే అసంతృప్తేం లేదే అని స్పష్టంగా అర్థమవుతోంది.
పక్కా ప్లాన్ ప్రకారమే..!
అయితే.. పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని.. దూకుడుగా ఉంటే నామినేటెడ్ పదవి.. అన్నీ అనుకున్నట్లు జరిగితే రానున్న ఎన్నికల్లో టికెట్ కూడా దక్కించుకుంటారని కొందరు సన్నిహితులు, పార్టీలోని కొందరు పెద్దలు అలీకి హితబోధ చేయగా.. ఆయన ఇలా చేస్తున్నారట. సో.. పక్కా ప్లాన్ ప్రకారమే అలీ రంగంలోకి దిగేశారట. ఇక నుంచి ప్రభుత్వ కార్యక్రమాలను జనాల్లోకి తీసుకెళ్లడానికి.. మీడియా ముందుకు వచ్చి ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వాలని అలీ ఫిక్సయ్యాడట. అంటే ఇటు చంద్రబాబు.. అటు పవన్‌కు కూడా అలీ కౌంటరేస్తాడేమో.!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments