ఏపీలో ఎన్నికలు యథావిథిగా జరుగుతాయా..!?

  • IndiaGlitz, [Monday,March 16 2020]

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిదే. ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నామని.. ఎన్నికలు ఎప్పడనేది తదుపరి ప్రకటన చేస్తామని ఎస్ఈసీ ప్రకటించారు. అయితే.. ఈ వాయిదా వ్యవహారంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏపీ సీఎం నువ్వా నేనా..? అసలు ఇలాంటి ప్రకటన చేసే అధికారం..?, కలెక్టర్లు, ఎస్పీ, ఎస్సైలు, పోలీసు అధికారులను ట్రాన్స్‌ఫర్ అధికారం మీకెక్కడిది..? అంటూ మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిసి జగన్ ఫిర్యాదు చేశారు. అయితే.. ఆదివారం నాడు ఇలా రగడతోనే ముగియగా.. సోమవారం నాడు మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది.

ఎన్నికల కమిషన్‌కు లేఖ
జగన్ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్‌‌కు ఏపీ సీఎస్ నీల సాహ్ని లేఖ రాశారు. ఎన్నికలు యథావిథిగా జరపాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని.. కరోనా నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టిందని నిశితంగా లేఖలో రాసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చేపట్టవచ్చని.. అవసరమైతే పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని కూడా సీఎస్ లేఖలో రాశారు.

గవర్నర్‌తో భేటీ.. కీలక ప్రకటన!
ఇదిలా ఉంటే జగన్ ఫిర్యాదు మేరకు గవర్నర్‌ హరిచందన్‌ను రమేష్‌కుమార్ భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు ఏపీలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు ఎన్నికల వాయిదా, నామినేషన్ల నేపథ్యంలో నెలకొన్న గొడవలపై గవర్నర్‌కు ఆయన నిశితంగా వివరించారు. అయితే భేటీ అనంతరం మీడియాతో మాట్లాడటానికి మాత్రం ఆయన సాహసించలేదు. మీడియాతో మాట్లాడాలని విలేఖరులు అడిగినప్పటికీ ఆయన మాత్రం మాట్లాడలేనని.. అవసరమైతే ప్రెస్‌నోట్ రిలీజ్ చేస్తానని చెబుతూ తన కార్యాలయానికి వెళ్లిపోయారు. అక్కడ్నుంచి వెళ్లిన రమేష్.. ఎన్నికల అధికారులతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. గవర్నర్‌తో చర్చించిన విషయాలపై చర్చించారు. అయితే ఆయన పత్రికా ప్రకటనలో ఏం ఉండనుంది..? ఏం ప్రకటించబోతున్నారు..? ఎన్నికల యథావిథిగా జరుపుతామని ప్రకటిస్తారా..? లేకుంటే వాయిదానే కొనసాగుతుందని చెబుతారా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కోర్టులకెక్కిన పంచాయతీ..!
ఇదిలా ఉంటే ఎన్నికలు యథావిథిగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం కోర్టు మెట్లెక్కింది. ఈ సందర్భంగా.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సర్కార్ ఎన్నికల నిర్వహణకు సహకరించేలా చూడాలని కోరింది. అంతేకాదు.. ఎన్నికలు వెంటనే జరిపించాలంటూ హైకోర్టులోనూ లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. తాండవ యోగేష్‌, జనార్ధన్‌ అనే వ్యక్తులు లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేయడం జరిగింది. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌కు ధర్మాసనం అనుమతించి మధ్యాహ్నం విచారించడానికి కోర్టు సిద్ధమైంది.

క్లారిటీ రావాలంటే..
అయితే.. కోర్టులు ఏం తీర్పు ఇవ్వనున్నాయ్..? ఏపీ ఎన్నికల కమిషన్ ఏం ప్రకటన ఇవ్వబోతోంది..? కీలక ప్రకటన చేస్తారా..? లేకుంటే ఏం చేయబోతున్నారు..? ఇంతకీ ఎన్నికలు వాయిదా అలానే కొనసాగుతుందా..? లేకుంటే యథావిథిగా జరుగుతాయా..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై క్లారిటీ రావాలంటే ఇవాళ సాయంత్రం వరకూ వేచి చూడక తప్పదు.