వేతన జీవులకు నిరాశ... ట్యాక్స్ స్లాబులపై నోరు విప్పని నిర్మలా సీతారామన్
Send us your feedback to audioarticles@vaarta.com
2022-23 ఆర్ధిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ పేయర్స్‌కు నిర్మలమ్మ నిరాశనే మిగిల్చారు. వారికి సంబంధించి కొత్తగా ఎలాంటి ప్రకటనా చేయలేదు విత్తమంత్రి. అప్‌డేటెడ్ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు గడువును రెండు సంవత్సరాలకు పెంచుతున్నట్లు మాత్రమే ఆర్ధిక మంత్రి తెలిపారు. సాధారణంగా పన్ను చెల్లింపుదారులకు డిసెంబర్ 31 వరకు గడువు ఇస్తారు. అయితే బడ్జెట్ ప్రతిపాదన ప్రకారం చూస్తే సంబంధిత అసెస్‌మెంట్ ముగిసిన తర్వాత రెండేళ్ల వరకు గడువు లభించనుంది.
పన్నులకు సంబంధించి.. సహకర సంస్థల పన్ను 15 శాతానికి తగ్గించడంతో పాటు సర్‌ఛార్జీని 7 శాతానికి తగ్గిస్తున్నట్లు నిర్మల ప్రకటించారు. అలాగే స్టార్టప్‌లకు పన్ను మినహాయింపు మరో ఏడాది పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. కొత్తగా ఏర్పాటయ్యే దేశీయ ఉత్పాదక కంపెనీలకు పన్ను రాయితీలు వుంటాయని సీతారామన్ చెప్పారు.
క్రిప్టో కరెన్సీలపై మాత్రం కేంద్రం కరుణ చూపలేదు.. ఈ తరహా లావాదేవీలపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలను అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పన్ను మినహాయింపు పరిమితిని 10 శాతం నుండి 14 శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. పీఎల్‌ఐ స్కీమ్ ద్వారా రాబోయే ఐదేళ్ల కాలంలో 60 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. వచ్చే 25 ఏళ్లు లక్ష్యంగా బడ్జెట్ 2022ను ఆవిష్కరిస్తున్నామని ఆమె వెల్లడించారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెన్‌టివ్ (పీఎల్ఐ) పథకం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయని నిర్మల ధీమా వ్యక్తం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com