జగన్ కేబినెట్‌లో రోజా, ఆళ్లకు నో ఛాన్స్.. ఆ ఇద్దరు వీళ్లే..!
- IndiaGlitz, [Friday,March 13 2020]
ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్దల సభకు వెళ్లే అభ్యర్థులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు స్థానాలకు గాను మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీ సీనియర్ నేత, రామ్‌కీ అధినేత అయోధ్య రామిరెడ్డి, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ అత్యంత సన్నిహితుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు పరిమళ్ నత్వానిని ఫిక్స్ చేశారు. అయితే.. ఈ ప్రకటన అనంతరం అసలు ఆ ఇద్దరు మంత్రుల స్థానంలో ఎవర్ని తీసుకుంటున్నారు..? జగన్ కేబినెట్‌లో మంత్రి పదవులు దక్కించుకునే అదృష్టవంతులు ఎవరు..? ఆ అవకాశం జగన్ ఎవరికి కల్పించనున్నారు..? అనే విషయాలపై ఏపీలో హాట్ హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఇద్దరికేనా..!
తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానంలో.. అదే జిల్లాకు చెందిన ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే.. మోపిదేవి వెంకటరమణ స్థానంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే, రోజా తర్వాత ఫైర్‌బ్రాండ్‌గా పేరుగాంచిన విడదల రజినీకి ఛాన్స్ ఎక్కువగా ఉందని విశ్వసనీయవర్గాల సమాచారం. బీసీ వర్గానికి చెందిన వీరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
రోజాకు నిరాశే!
కాగా.. రోజాకు ఈసారైనా కచ్చితంగా చాన్స్ ఉంటుందని గత కొన్నిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు మరోసారి వినిపించాయి. అంతేకాదు ఆళ్ల రామకృష్ణారెడ్డి, రోజాకు దాదాపు ఫిక్స్ అయిపోయారని అధికారిక ప్రకటనే తరువాయి అని వార్తలు వచ్చాయి. అంటే రోజాకు నిరాశే అన్న మాట. మరోవైపు ఆళ్ల కూడా గట్టిగా మంత్రి పదవి అడిగే పరిస్థితి కూడా లేదు.. ఎందుకంటే ఆయన సోదరుడు అయోధ్యరామిరెడ్డికి పిలిచి మరీ రాజ్యసభ సీటిచ్చారు. మరి ఫైనల్‌గా పరిస్థితి ఎలా ఉంటుందో.. అదృష్టం ఎవర్ని వరించనుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.