సెలబ్రిటీలకు స్టీల్ ప్లాంటు సమస్య పట్టదా?
- IndiaGlitz, [Saturday,February 13 2021]
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటు పరం చేయనున్నారన్న వార్త ఏపీని కుదిపేస్తోంది. దీంతో అటు పొలిటికల్, ఇటు సామాన్య ప్రజానీకం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంతగానో పోరాడి.. తమ రాష్ట్ర ప్రజానీకం ప్రాణాలు ఫణంగా పెట్టి తెచ్చుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడాన్ని సామాన్య ప్రజానీకం జీర్ణించుకోలేక పోతోంది. దీంతో ఇప్పటికే ఆందోళనలు.. దీక్షలు చేస్తూ తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విపక్ష నేతలు సైతం విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయవద్దంటూ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా సైతం చేసి తోటి నేతలకు రాజీనామాలకు సిద్ధమవ్వాలని పిలుపునిస్తున్నారు.
ఒకరకంగా చూస్తే విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేసేందుకు కేంద్రం ముందడుగు వేస్తే మాత్రం ఏపీలో మరో ఉద్యమం వస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అక్కడ ఇంత జరుగుతున్నా మన సెలబ్రిటీలకు మాత్రం పట్టడంలేదు. కనీసం ఖండించిన పాపాన కూడా ఒక్కరూ పోవడం లేదు. విశాఖ షూటింగ్‌ల కోసం వినియోగించుకుంటారు.. అవసరమైతే అక్కడ ఫిలిం సిటీలు కడతామంటారు కానీ విశాఖ ఉక్కుపై మాత్రం స్పందించరు. ఒకరకంగా చెప్పాలంటే సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్స్ అంతా దాదాపు ఏపీకి చెందిన వారే గమనార్హం. మరి అలాంటి స్టార్స్ తమ రాష్ట్రానికి తలమానికమైన విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేస్తామంటుంటే కనీసం స్పందించకపోవడం పట్ల ప్రజానీకం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.
ఇదొక్కటే కాదు.. గతంలో కూడా ఏ సందర్భంలోనూ ఏపీకి అనుకూలంగా సినీ ఇండస్ట్రీ నిలిచిందైతే లేదు. ఎన్నో సార్లు ఈ విషయంలో విమర్శలను మూటగట్టుకుంది. రాజధాని రైతులు ఏడాదికి పైగా దీక్షలు చేస్తున్నా.. వారికి అండగా నిలిచింది లేదు. అనుకూలంగా ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది లేదు సరికదా.. పైగా మెగాస్టార్ చిరంజీవి మూడు రాజధానులకు మద్దతు పలికి ఏపీ ప్రజానీకం ఆగ్రహానికి గురయ్యారు. ఎల్జీ పాలిమర్స్ ఘటనలో చనిపోయినా, తిత్లీ తుఫాన్ వచ్చినా, ఏ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నా, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నా సినీ ఇండస్ట్రీ మాత్రం అండగా నిలిచింది లేదు. అదే తమిళనాడులో అయితే ప్రజలకు అండగా ఇండస్ట్రీ మొత్తం తరలివెళుతుంది. ఏదైనా ఆపద వస్తే స్టార్ హీరోలు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటారు. కానీ ఇక్కడ రివర్స్. దీంతో ఏపీ ప్రజానీకం సినీ ఇండస్ట్రీపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది.