Mukarram Jah : ముకరం జా మరణం.. ముగిసిన నిజాంల ఘన వారసత్వం
- IndiaGlitz, [Wednesday,January 18 2023]
హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం ముకరం జా కన్నుమూయడంతో అసఫ్ జాహీ రాజ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన టర్కీలోని ఇస్తాంబుల్‌లో తుదిశ్వాస విడిచారు. అయితే తన పూర్వీకులను ఎక్కడైతే ఖననం చేశారో అక్కడ తనకు కూడా అంత్యక్రియలు నిర్వహించాలని ముకరం జా తన చివరి కోరికగా తెలియజేశారు. ఆయన కోరిక మేరకు మంగళవారం టర్కీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు ముకరం జా భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. ప్రజల సందర్శనార్ధం రేపు సాయంత్రం 3 గంటల వరకు చౌమహల్లా ప్యాలెస్‌లో ఆయన పార్ధీవ దేహాన్ని వుంచారు. ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముకరం జాకు నివాళులర్పించారు.అనంతరం బుధవారం సాయంత్రం మక్కా మసీదులో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. మొత్తం ఏడుగురు నిజాంలను సమాధి చేసిన చార్మినార్ సమీపంలోని రాజ కుటుంబీకుల సమాధుల వద్ద ముకరం జాను
ఖననం చేయనున్నారు.
80లలో భారత్‌లో అత్యంత సంపన్నుడిగా ముకరం ఝా :
చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ మనుమడు, నిజాం పెద్ద కొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతులకు 1933 అక్టోబర్ 6న ముకరం ఝా జన్మించారు. ఆయన తల్లి ప్రిన్సెస్ దుర్రె షెహవార్ .. టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యం చివరి సుల్తాన్ కుమార్తె. ముకరం ఝా డెహ్రాడూన్‌లోని డూన్ స్కూల్‌లో, ఇంగ్లాండ్‌లోని హారో, పీటర్‌హౌస్, కేంబ్రిడ్జ్‌లో చదువుకున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, రాయల్ మిలటరీ అకాడమీ శాండ్‌హర్ట్స్‌లోనూ విద్యను అభ్యసించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు అత్యంత ఆప్తుల్లో ముకరం ఝా కూడా ఒకరు.
కొడుకులను కాదని, ముకరం జాను వారసుడిగా ప్రకటించిన నిజాం:
హైదరాబాద్ సంస్థానం చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వారసుడిగా ముకరం ఝాను 1954 జూన్ 14న ప్రకటించారు. అప్పటి నుంచి 1971 వరకు ఆయన హైదరాబాద్ 8వ నిజాంగా వ్యవహరించారు. అంతేకాదు.. 1980లలో ముకరం ఝా దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే ఐదు వివాహాలు, విడాకులు, ఇతర కారణాల వల్ల ఆయన ఆస్తులను కోల్పోవాల్సి వచ్చింది. ఈయనకు “హిస్ ఎక్సల్టెడ్ హైనెస్ (HEH) ప్రిన్స్ రుస్తమ్-ఇ-దౌరన్, అరుస్తు-ఇ-జమాన్, వాల్ మమలుక్, అసఫ్ జా VIII, ముజఫర్ ఉల్-మమాలిక్, నిజాం ఉల్-ముల్క్, నిజాం ఉద్-దౌలా, నవాబ్ మీర్ బరాకత్ 'అలీ ఖాన్ సిద్ధిఖీ బహదూర్ , సిపాహ్ సలార్, ఫత్ జంగ్, నిజాం ఆఫ్ హైదరాబాద్ లతో పాటు సైనిక బిరుదు 'గౌరవ లెఫ్టినెంట్-జనరల్ వుంది.
ఒకప్పుడు అపర కుబేరుడు.. డబుల్ బెడ్‌రూంలో చివరి రోజులు:
ముకరమ్ జా మొత్తం ఐదుసార్లు వివాహం చేసుకున్నారు. ఆయన భార్యల పేర్లు .. ఎస్రా బిర్గిన్, హెలెన్ సిమన్స్, మనోల్య ఒనూర్, జమీలా బౌలరస్, ఆయేషా ఓర్చెడి. ఇప్పటికీ హైదరాబాద్‌లో ముకరం జాకు భారీ సంపద ఉంది. చౌమహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్, నజ్రీబాగ్ ప్యాలెస్,చిరాన్ ప్యాలెస్, పురానీ హవేలీ ,ఔరంగాబాద్‌లోని నౌఖండ ప్యాలెస్ అతనివే. నిజాంల సంపదకు వారసుడైన ముకరం జా టర్కీలోని ఇస్తాంబుల్‌లోని బోస్ఫరస్‌లో రెండు పడక గదుల అపార్ట్‌మెంట్‌లో తన చివరి రోజులను గడిపారు.అయితే ఆయన మరణంతో నిజాంల వారసత్వం అంతరించినట్లయ్యింది.