తమిళనాడు, ఏపీ వైపు దూసుకొస్తున్న నివర్ తుపాను
- IndiaGlitz, [Wednesday,November 25 2020]
నివర్.. అతి తీవ్ర తుపానుగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ వాయువ్య దిశగా తీవ్ర తుపాను కదిలింది. గంటకు 6 కిలో మీటర్ల. వేగంతో నివర్ తుపాను కదులుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ వైపు దూసుకొస్తోంది. సాయంత్రానికి కరైకల్-తమిళనాడు మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు వెల్లడించారు. గంటకు 120-145 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందన్నారు. తీరం దాటే సమయంలో నిరవ్ మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
తమిళనాడులో అతి భారీ వర్షాలు..
నివర్ తుపాను కారణంగా తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుకొట్టై, తంజావురు, తిరువరూర్, నాగపట్నంలో భారీ వర్షాలు.. విల్లుపురం, తిరువణ్ణామలై, చెంగల్‌పట్టులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి సీఎంలతో ప్రధాని మోదీ మాట్లాడారు. నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. 13 రైళ్లను దారి మళ్లించగా.. 24 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. తుపాను కారణంగా చెన్నై లోకల్ రైళ్లు మొత్తం రద్దు చేయబడ్డాయి. 7 జిల్లాల్లో రవాణా వ్యవస్థను పూర్తిగా తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది.
తెలుగు రాష్ట్రాలపైనా ప్రభావం..
తెలుగు రాష్ట్రాలపైనా నివర్ తుపాను ప్రభావం కనిపిస్తోంది. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు దగ్గర రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నాయి. చిత్తూరు జిల్లాకు సైతం అధికారులు భారీ వర్ష సూచన చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశాలు జారీ చేశరాు. చిత్తూరు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు(91008 04313) ఏర్పాటు చేశారు.