తీవ్ర తుపానుగా మారిన వాయుగుండం
Send us your feedback to audioarticles@vaarta.com
వాయుగుండం తీవ్ర తుపానుగా మారింది. ఈ తుపానుకు నివర్ అనే పేరును పెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 450 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి ఆగ్నేయంగా 480 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. రాగల 12 గంటల్లో వాయుగుండంగా, తదుపరి 24 గంటల్లో తీవ్ర తుపానుగా నివర్ మారనుందని తెలిపింది.
ఈ నెల 25న సాయంత్రం తమిళనాడులోని మమాళ్లపురం- కరైకల్ మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉంది.
తుపాను తీరాన్ని దాటే సమయంలో 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో తమిళనాడు సహా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని విపత్తు నిర్వహణ అధికారులు హెచ్చరించారు. తుపాను కారణంగా కడల్లోర్, విల్లుపురం, పుదుచ్చేరి తదితర తీరప్రాంత జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు నీరు చొచ్చుకువచ్చే అవకాశం ఉందన్నారు.
తమిళనాడు తీరంలో ముందు జాగ్రత్త చర్యగా రెండు కొస్ట్ గార్డ్ నౌకలు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను అధికారులు మోహరించారు. నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా మారిన తీవ్ర వాయుగుండం నివర్.. తీరం దాటే సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి గంటకు 65-85 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఐఎండీ వెల్లడించింది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తలను తీసుకోవాలని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments