‘నివర్’గప్పుతున్న తుపాను.. 26 వరకూ భారీ వర్షాలు..
- IndiaGlitz, [Monday,November 23 2020]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు మరో తుపాను ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం మీదుగా తీవ్ర అల్ప పీడనం కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. కాగా.. ఇది 24 గంటల లోపు తుపానుగా మారే అవకాశముందని ప్రకటించింది. ఈ తుపానుకు ‘నివర్’ అనే పేరు పెట్టనున్నారు. కాగా.. తుపానుగా మారిన అనంతరం ఈనెల 25న తమిళనాడు, పుదుచ్చేరి తీరాన కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
కాగా.. ఈ తుపానుకు ‘నివర్’ అనే పేరును ఇరాన్ దేశం సూచించింది. దీని కారణంగా 25, 26 తేదీల్లో ఏపీలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. అల్ప పీడనం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో నేడు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే అరేబియా సముద్రంలో ‘గతి’ తీవ్ర తుపాను కొనసాగుతుండగా.. తాజాగా బంగాళాఖాతంలో మరో తుపాను ముంచుకొస్తోంది. ఈ తుపాను ప్రభావంతో ఏపీ, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశంలో.. ముఖ్యంగా.. తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో మంగళవారం నుంచి.. ఇక బుధవారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఉరుములు, మెరుపులతో భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని అంచనా వేస్తున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఆదివారం నుంచే హెచ్చరికలు జారీచేశారు. ఈ తుపాను ప్రభావం ఈ నెల 26 వరకూ కొనసాగనుందని వాతావరణ శాఖ వెల్లడించింది.