నిత్యానంద సంచలన నిర్ణయం.. ముహూర్తం కూడా ఫిక్స్
- IndiaGlitz, [Tuesday,August 18 2020]
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తలకెక్కారు. గణేష్ చతుర్థి సందర్భంగా ఆగస్ట్ 22న ఆయన ఓ సంచలనానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇటీవల తనకు ‘కైలాస’ అనే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న నిత్యానంద మరో అడుగు ముందుకు వేసి రిజర్వ్ బ్యాంకును సైతం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ప్రత్యేక కరెన్సీని అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా.. అది చెల్లు బాటుకు సైతం వివిధ దేశాలతో పలు ఒప్పందాలు కుదర్చుకుంటున్నట్టు నిత్యానంద వెల్లడించారు.
ఆగస్ట్ 22న రిజర్వ్ బ్యాంకును స్థాపించడంతోపాటు అదే రోజు నుంచి కరెన్సీని కూడా చెలామణిలోకి తీసుకు రానున్నట్టు నిత్యానంద తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలతో పాటు పాలసీ డాక్యుమెంట్లను సిద్ధం చేశామన్నారు. చట్టబద్ధంగానే ఇదంతా చేస్తున్నట్టు నిత్యానంద తెలిపారు. విరాళాల రూపంలో ప్రపంచ దేశాల నుంచి వస్తున్న డబ్బును ఆర్గనైజ్ చేసి లావాదేవీలు కొనసాగించనున్నట్టు నిత్యానంద స్పష్టం చేశారు. ఇప్పటికే నిత్యానంద ఫోటోలతో ముద్రితమైన కరెన్సీ నోట్ల ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
కాగా.. గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆశ్రమాలు స్థాపించిన నిత్యానంద.. ఆధ్యాత్మిక ముసుగులో మహిళలపై లైంగిక దాడి పాల్పడటం.. కేసులవడం.. తదితర కారణాలతో ఆయన దేశాన్ని విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఇటీవల ఆయన ఈక్వెడార్ నుంచి ఒక చిన్న ద్వీపాన్ని కొనుగోలు చేసి దానికి ‘కైలాస్’ అని పేరు పెట్టారు. తన దేశానికి ఒక పాస్‌పోర్ట్, జెండా, జాతీయ చిహ్నాన్ని కూడా డిజైన్ చేయడమే కాకుండా.. ‘కైలాస్’కు ప్రధానమంత్రి, కేబినెట్‌ను కూడా ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్నట్టు నిత్యానంద వెల్లడించారు. ఇప్పడు బ్యాంకును కూడా ఏర్పాటు చేస్తున్నట్టు నిత్యానంద ప్రకటించారు.