YS Jagan:జగన్ నాలుగేళ్ల కష్టానికి ప్రతిఫలం.. ఏపీలో తగ్గుతోన్న పేదరికం, నీతి ఆయోగ్ ప్రశంసలు
- IndiaGlitz, [Sunday,July 23 2023]
భారతదేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అంతిమ ధ్యేయం పేదరికాన్ని రూపుమాపడమే. ఇందుకోసం ఎన్నో విధాన నిర్ణయాలు, సంక్షేమ పథకాలకు ఏళ్లుగా రూపకల్పన చేస్తూ వస్తున్నారు పెద్దలు. వీటిలో కొన్ని సత్ఫలితాలను ఇవ్వగా.. మరికొన్ని మాత్రం ఫెయిల్ అయ్యాయి. కానీ సంక్షేమ పథకాలు మాత్రం ఆగడం లేదు. దేశాన్ని పాలించిన ప్రధానులు, రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రులు రకరకాల అజెండాలతో ముందుకు వచ్చారు. వీరిలో కొందరిది అభివృద్ధి అయితే మరొకరిది సంక్షేమ మంత్రం. ఈ రెండో కోవలోకే వస్తారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాలుగేళ్ల క్రితం ఏపీ ఎన్నికల్లో సంక్షేమ హామీలతో అధికారంలోకి వచ్చారు వైఎస్ జగన్. నవరత్నాల పేరుతో కనివినీ ఎరుగని రీతిలో ఆయన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. కరోనా సంక్షోభంలోనూ, రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితి అస్తవ్యస్తంగా వున్నా తన బాధలేవో పడుతూ చెప్పిన టైంకి, చెప్పిన వర్గానికి బటన్ నొక్కి నిధులు విడుదల చేస్తున్నారు జగన్. అయితే అభివృద్ధిని మాత్రం జగన్ పక్కనపెట్టారంటూ విమర్శలు చేసేవారు నానాటికీ పెరుగుతున్నారు.
2016లో 11.7 శాతంగా వున్న పేదరికం:
అయితే .. జగన్ పాలనలో పేదరికం తగ్గుతోందట. ఇదేదో వైసీపీ పబ్లిసిటీ స్టంట్ కాదు.. సాక్షాత్తూ నీతి ఆయోగ్ చెబుతున్న మాట. 2016లో ఆంధ్రాలో పేదరికం 11.7 శాతం ఉండగా 2021 నాటికి అది 6.06 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో 2016 నాటికి 14.72 శాతం పేదరికం ఉండగా అది 2021 నాటికి 7.71 శాతానికి తగ్గిందని నీతి ఆయోగ్ తెలిపింది. ఇదే సమయంలో పట్టణ ప్రాంత పేదరికం 4.63 శాతం నుంచి 2.20 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. ఇదంతా ఒక్కరోజులో సాధ్యమైంది కాదు.. పేదల సంక్షేమం, పేదరిక నిర్మూలన కోసం అహోరాత్రులు కృషిచేస్తున్న జగన్ మోహన్ రెడ్డి కష్టానికి ప్రతిఫలం వచ్చింది. నాలుగేళ్ల క్రితం ఆయన వేసిన సంక్షేమ మొలకలు మొక్కలయ్యాయి.
సంక్షేమ పథకాలతో పేదరికాన్ని రూపుమాపేందుకు జగన్ కృషి :
జనంలో పేదరికం తొలగించడమే అభివృద్ధికి అసలైన నిర్వచనంగా సీఎం పథకాలు అమలు చేస్తున్నారు. అందుకే జగన్ పాలన అంటే సంక్షేమ పాలన అనేలా మారింది. దాదాపు ప్రతి పేద ,మధ్యతరగతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందుతోంది. ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి. దీంతో ఆయా కుటుంబాలు జగన్ పాలనపై సానుకూలంగా వున్నాయి. దేశంలో ఇన్ని సంక్షేమ పథకాలు మరే రాష్ట్రంలో అమలు కావడం లేదు. పైగా ఈ పథకాల అమలులో వివక్ష, అవినీతి లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. దశాబ్ధాల పాటు అభివృద్ధి పేరుతో అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వాలు జనాన్ని విస్మరించిన మాట వాస్తవం . అభివృద్ధి అంటే అన్ని వర్గాల ప్రజలను ప్రపంచపు పరుగులో కలుపుకుని పోవడమని జగన్ గుర్తించారు. అది విద్య, వైద్యంతో పాటు ఇతర కనీస అవసరాలు తీర్చడం రూపంలోనే వుంటుంది. దీనికి ప్రత్యక్ష నగదు బదిలీ తప్పించి మరో మార్గం లేదు. అందుకే జగన్ ప్రభుత్వం తన లక్ష్యం విషయంలో చాలా సూటిగా వ్యవహరిస్తోంది.
జగన్ పాలన భేష్ అన్న నీతి ఆయోగ్:
ఉచిత విద్య, వైద్యం. రైతులకు భరోసా.. బాలలకు పౌస్టికాహారం.. గర్భిణులకు ఇచ్చే ప్రత్యేక ఆహారం వంటివి ప్రజలకి ఎంతగానో మేలు చేశాయి. ఇంటి ముంగిటకు పథకాలు, ప్రభుత్వ సేవలు అందిస్తూ పేదరికపు కాటు నుంచి ప్రజల్ని కాపాడే బాధ్యతను జగన్ తీసుకున్నారు. ప్రజలు సంక్షేమ రాజ్యంలో సుభిక్షంగా ఉంటూ పోషకాహారం తీసుకుంటూ ఉన్నత జీవన ప్రమాణాల్లో పొందుతున్నట్లు నీతి ఆయోగ్ వెల్లడించింది. ఇంతకంటే జగన్ పాలన ఎలా వుందన్న దానికి వేరే కొలమానం అక్కర్లేదు. ఎవరెన్ని చేసిన అంతిమంగా పేదలు అభివృద్ధి చెందాలి. ఈ ప్రక్రియ ఏపీలో నిర్విఘ్నంగా జరుగుతోంది.