ఒకే చిత్రంలో నిత్యా, సాయి ప‌ల్ల‌వి?

  • IndiaGlitz, [Saturday,March 17 2018]

ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలలో నటనా ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలంటే దర్శకనిర్మాతల చూపు ఆ ఇద్దరి నటీమణుల వైపే ఉంటుంది. వారే.. కేర‌ళ‌కుట్టి నిత్య మీనన్, చెన్నై పొన్ను సాయి పల్లవి. పాత్రలో ప్రాధాన్యత ఉంటే.. వయసుని,  ఇమేజ్‌ను కూడా పక్కన పెట్టి నటనతో పాత్రకే ప్రాణం పోసే నటీమణులు వీరు. వీరి నటనాప్రతిభకు అద్దం పట్టే సినిమాలుగా.. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’,   ‘అ!’, (నిత్యా మీన‌న్‌).. 'ఫిదా', ‘కణం’ (సాయిప‌ల్ల‌వి) ల‌ను చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే.. ఇటీవల పూజా కార్యక్రమాలను పూర్తిచేసుకున్న తన తదుపరి చిత్రంలో..  నాయికల‌ పాత్రకోసం వీరిరువురితో చర్చలు కొనసాగిస్తున్నారు ‘డిటెక్టివ్’  ఫేమ్‌  మిస్కిన్. శంతను భాగ్యరాజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ సినిమాటోగ్రాఫరుగా వ్యవహరించనున్నారు. లిబ్రా ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తెలుగులోనూ ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డికానున్నాయి.