నేడు సీఎంగా నితీశ్ ప్రమాణ స్వీకారం.. మంత్రి పదవులపై ఆసక్తి..
- IndiaGlitz, [Monday,November 16 2020]
బిహార్ నూతన ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ వరుసగా నాలుగోసారి సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేబినెట్ విషయమై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన కేబినెట్‌లో ఎంత మందికి చోటు దక్కుతుంది? ఏ ఈక్వేషన్‌లో ఎన్డీయేలోని భాగస్వామ్య పార్టీలకు ఎన్ని పదవులు ఇస్తారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కాగా.. నితీశ్ తన కేబినెట్‌లోకి 16 నుంచి 17 మందిని తీసుకునే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. జేడీయూ, బీజేపీ నుంచి ఏడుగురు చొప్పున కేబినెట్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఏన్డీయే భాగస్వామ్య పార్టీలైన హిందుస్థాని అవామీ మోర్చా-సెక్యులర్, వికాశీల్ ఇన్సాన్ పార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేబినెట్‌లో స్థానం దక్కనున్నట్టు సమాచారం.
ప్రతి 7 సీట్లకు రెండు స్థానాలు..
కాగా.. గెలిచిన సీట్లను బట్టే బెర్త్‌ల సంఖ్య ఉంటుందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 74 సీట్లు సాధించగా.. జేడీయూ 43 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలోనే ప్రతి 7 సీట్లకు రెండేసి చొప్పున మంత్రి పదవులు లభించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రకారం చూస్తే బీజేపీ నుంచి 18 మందికి.. జేడీయూ నుంచి 12 మందికి కేబినెట్‌లో స్థానం దక్కనుంది. కాగా.. బిహార్‌లో 243 నియోజకవర్గాలున్నాయి. ఈ విధంగా చూస్తే కేబినెట్‌లో భర్తీ చేసే స్థానాల సంఖ్య 15 శాతానికి మించరాదు. కాబట్టి బిహార్ కేబినెట్‌లో గరిష్టంగా 36 మందికి మాత్రమే అవకాశముంది. ఈ క్రమంలోనే ప్రస్తుతానికి 16 నుంచి 17 స్థానాలను భర్తీ చేసి.. రాబోయే రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేసి మరికొందరికి స్థానం కల్పిస్తారని తెలుస్తోంది.
ఉప ముఖ్యమంత్రి ఎవరు?
కాగా.. ఉప ముఖ్యమంత్రి ఎవరనేదే దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ స్థానంలో ఇద్దరు డిప్యూటీ సీఎంలను బీజేపీ నియమించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాగా.. తాజాగా సుశీల్ మోదీ తన ట్వీట్‌లో తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ తనకు చాలా ఇచ్చాయని, భవిష్యత్తులో ఏ బాధ్యత అప్పగించినా శక్తిమేరకు పనిచేసేందుకు సిద్ధమేనని తెలిపారు. ఈ ట్వీట్‌ను చూసిన వారంతా సుశీల్ మోదీకి మరోసారి డిప్యూటీ సీఎం పదవి కష్టమేననే భావన కలుగుతోంది. మరోవైపు సుశీల్ మోదీని రాజ్యసభకు పంపి, అనంతరం కేంద్ర కేబినెట్‌లో తీసుకునే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. వీటన్నింటిపై ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.