కరోనా టైమ్‌లో నితిన్ ఏం చేస్తున్నాడో తెలుసా?
- IndiaGlitz, [Sunday,April 12 2020]
కరోనా వైరస్ నివారణ చర్యలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది. ప్రజలు, సెలబ్రిటీలు ఇళ్లకే పరిమితమయ్యారు. సినీ తారల విషయానికి వస్తే ఎవరి పనులు వారే చేసుకుంటూ తమకు నచ్చినట్లుగా సమయాన్ని గడుపుతున్నారు. తీరిక సమయాల్లో ఏం చేస్తున్నారనే విషయాలపై కొందరైతే చిన్నపాటి వీడియోలు తీసి కూడా పోస్ట్ చేస్తున్నారు.
ఇదే విషయంపై హీరో నితిన్‌ను ప్రశ్నిస్తే.. ‘‘నాకు బద్దకం ఎక్కువ. ఒక్కడినే జిమ్ చేయలేను. జిమ్ కోచ్ కూడా రావడం లేదు కాబట్టి, రెగ్యులర్ షెడ్యూల్‌ను పక్కన పెట్టేశాను. అన్నం, పప్పు, అమ్లెట్, అవకాయ్ ఇలా నాకు నచ్చిన వంటకాలను తింటున్నాను. అమ్మ చేతి వంటలన్నీ తింటున్నాను. టీవీతో పాటు డిజిటల్ మీడియంలోనూ సినిమాలు చూస్తున్నాను. అర్ధరాత్రి రెండు గంటలకు పడుకుంటున్నాను. ఉదయం పదకొండు గంటలకు నిద్ర లేస్తున్నాను. తినడం, సినిమాలు చేయడమే నా దినచర్యగా మారింది’’ అన్నారు. ఈ ఏడాది నితిన్ సక్సెస్ కొట్టిన భీష్మ చిత్రం ఈ నెల 27 నుండి డిజిటల్ మీడియంలోకి అందుబాటులో రానుందట.
కరోనా నివారణ చర్యల కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.20 లక్షల విరాళాన్ని అందించిన తొలి హీరో నితినే కావడం విశేషం. ఈ విషయంపై ప్రశ్నిస్తే.. నా బాధ్యతగానే విరాళమిచ్చానని సింపుల్‌గా సమాధానం చెబుతున్నాడు నితిన్.