నితిన్..నాలుగోసారి

  • IndiaGlitz, [Thursday,May 24 2018]

జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్న యువ క‌థానాయ‌కుల్లో నితిన్ ఒక‌రు. ఇదిలా ఉంటే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన‌ నితిన్.. పవన్ సినిమాలను తెరకెక్కించిన దర్శకులతోనూ అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తున్నారు. పవన్‌తో సినిమాలను తెరకెక్కించిన పూరి జగన్నాథ్ (‘బద్రి’, 'కెమెరామెన్ గంగ‌తో రాంబాబు'), కరుణాకరన్ (‘తొలిప్రేమ’, 'బాలు'), త్రివిక్రమ్ శ్రీనివాస్ (‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’)తో ఇప్ప‌టికే ‘హార్ట్ ఎటాక్’ (పూరి), ‘చిన్నదానా నీకోసం’ (కరుణాకరన్), ‘అఆ’ (త్రివిక్రమ్) సినిమాలను చేసారు నితిన్.

ఇప్పుడు ఇదే బాట‌లో మరో ప‌వ‌న్ దర్శకుడు డాలీ (కిషోర్ కుమార్ పార్థ‌సాని) దర్శకత్వంలోనూ నితిన్ ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో పవన్ హీరోగా డాలీ డైరెక్షన్‌లో ‘గోపాల గోపాల’, కాటమ రాయుడు’ సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు నితిన్ కోసం డాలీ ఓ కొత్త తరహా కథను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూడు సార్లు పవన్ దర్శకుల సినిమాలలో నటించిన నితిన్.. అన్నీ కుదిరితే నాలుగోసారి ఈ దర్శకుడితో కూడా పనిచేసే అవకాశం లేకపోలేదు. మ‌రి.. త్రివిక్ర‌మ్ లాగే ఈ ద‌ర్శ‌కుడు కూడా నితిన్‌కు హిట్ ఇస్తాడో లేదో చూడాలి.