Nishabdham Review
సినిమాలకు థియేటర్స్ ఓపెన్ కానీ పరిస్థితుల్లో ఓటీటీల్లో కొన్ని సినిమాలు విడుదలయ్యాయి. ఆ కోవలో విడుదలైన చిత్రమే ‘నిశ్శబ్దం’. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో మాధవన్, అంజలి, మైకేల్ మ్యాడ్సేన్ ఇతర పాత్రల్లో నటించారు. సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయాలనుకుంటే, కరోనా ప్రభావం కారణంగా సినిమాను అమెజాన్‌లో విడుదల చేశారు. అంచనాలతో రూపొందిన ఈ సినిమాలో అనుష్క దివ్యాంగురాలి(మాటలు రాని, చెవులు వినపడని అమ్మాయి)లైన చిత్రకారిణి పాత్రలో నటించింది. అమెరికాలోనే సినిమా అంతటినీ చిత్రీకరించారు. ఆత్మలు, హత్యలు అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగే సినిమాగా టీజర్, ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు తెలుగు సినిమాల్లో కేరాఫ్‌గా నిలిచిన అనుష్క, భాగమతి తర్వాత నటించిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? క‌్రాస్ జోనర్ సినిమాగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలైన నిశ్శబ్దం ఎలా ఉందనే విషయం తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం...
కథ:
సీయటెల్‌కు దూరంగా ఉండే ఓ విల్లాలో ఓ జంటను ఎవరో హత్య చేస్తారు. పోలీసులకు ఆ హత్యలు ఎవరు చేశారనేది తెలియదు. ఆ విల్లాను హాంటెడ్ హౌస్‌గా భావించి ఎవరూ ఆ ఇంట్లోకి రారు. తర్వాత కాలంలో ఓ కొలంబియాకు చెందిన బిజినెస్‌మేన్ కొంటాడు. చాలా ఏళ్లకు.. 2019లో ఆ ఇంట్లోకి గొప్ప మ్యూజిషియన్ ఆంటోని(మాధవన్), దివ్యాంగురాలి(మాటలు రాని, చెవులు వినపడని అమ్మాయి)లైన చిత్రకారిణి సాక్షి(అనుష్క) వస్తారు. అప్పటికే ఇద్దరికీ నిశ్చితార్థం జరిగి ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన వారిపై ఎవరో దాడి చేస్తారు. ఆంటోని చనిపోతాడు. గాయాలతో సాక్షి తప్పించుకుంటుంది. అప్పటికే సీయటెల్‌లో చాలా మంది అమ్మాయిలు కనిపించకుండా పోతారు. దాంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు ప్రారంబిస్తారు. పోలీస్ ఆఫీసర్ రిచర్డ్(మైకేల్ మ్యాడ్‌సేన్), డిటెక్టివ్ మహాలక్ష్మి(అంజలి)కి కేసులో ఎలాంటి క్లూ దొరకదు. అదే సమయంలోసాక్షి స్నేహితురాలి సోనాలి(షాలిని పాండే) కనిపించకుండా పోయిందనే నిజం పోలీసులకు తెలుస్తుంది. దాంతో మహాలక్ష్మి కేసును సోనాలి మిస్సింగ్ కోణంలో సాల్వ్ చేయడం ప్రారంభిస్తుంది. దీంతో కేసులో సోనాలికి ఎలాంటి నిజాలు తెలుస్తాయి? సోనాలి మిస్సింగ్‌కి, ఆంటోని హత్యకు ఉన్న లింకేంటి? హాంటెడ్ హౌస్‌లో ఉండేదెవరు? ఆంటోనీని ఎవరు చంపారు? సాక్షి కేసును మహాలక్ష్మి ఎలా సాల్వ్ చేస్తుంది? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..
సమీక్ష:
సినిమా ప్రారంభం.. ఓ హాంటెడ్ హౌస్‌లో ఉంటుంది. సన్నివేశం చాలా స్లోగా ఉంటుంది. రొటీన్ హారర్ సినిమా సీన్‌లాగా అనిపిస్తుంది. తర్వాత అనుష్క, మాధవన్ పాత్రలు ఎంట్రీ అవుతాయి. మాధవన్ హత్య తర్వాత సినిమాలో కాస్త స్పీడు పెరుగుతుంది. ఆ హత్యను ఎవరు చేశారనే అంశాలు ప్రారంభంలో ఆసక్తికరంగా అనిపిస్తాయి. కానీ సినిమాలో సియటెల్‌లో కనిపించకుండా పోయిన చాలా మంది అమ్మాయిలు, షాలిని మిస్సింగ్ అని పదే పదే చెప్పడంతో ఈ మిస్సింగ్‌ల వెనుక, ఆంటోని హత్య వెనుకున్న మిస్టరీ ఏంటనేది కాస్త లాజికల్‌గా ఆలోచిస్తే తెలిసిపోయే అంశంగానే కనిపిస్తుంది. సినిమాను అమెరికాలో చిత్రీకరించారనడం తప్పితే.. సినిమా కాన్సెప్ట్‌లో ఎలాంటి కొత్తదనం కనిపించదు. అనుష్క పాత్ర, కాస్త భాగమతి తరహాలో డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ వేరే సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తాయి. సినిమాలోని ట్విస్టులు, టర్న్‌లు అర్థమవుతాయి. సినిమాను అంజలి కోణంలో చెప్పడంతో సినిమాలో సస్పెన్స్ భాగాన్నిస్టార్ట్ చేస్తే.. సుబ్బరాజ్ కోణంలో సినిమా హత్యల వెనకున్న సీక్రెట్‌ను రివీల్ చేశారు. అనుష్క పాత్ర కంటే సెకండాఫ్‌లో సోనాలి పాత్రకే ప్రాధాన్యత ఎక్కువగా కనిపిస్తుంది. అనుష్క చేసిన దివ్యాంగురాలి యాక్టింగ్ బాగానే ఉన్నా.. లుక్ పరంగా అనుష్క బొద్దుగా తయారైందని అర్థమవుతూనే ఉంది. మాధవన్ తన పాత్రను చక్కగా క్యారీ చేశారు. ఇక మైకేల్ మ్యాడ్‌సేన్ పాత్రలో ఒదిగిపో్యారు కానీ.. ఆ పాత్రను ఆయనే ఎందుకు చేశారంటే.. క్యాస్టింగ్ వెయిటేజ్ పెంచడానికి తప్ప ఏం లేదు అనిపిస్తుంది. సినిమా మొత్తంగా చూస్తే ఈ కాన్సెప్ట్స్ ఇది వరకు చూసేశాం కదా అనిపిస్తుంది. అవసరాల పాత్రకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. అంజలి పాత్ర పరిధి మేరకు చక్కగా యాక్ట్ చేసింది. మిగిలిన పాత్రధారులందరూ అలా కనిపించి వెళ్లిపోతారు. చిక్కుముడిని పెట్టడం కదా.. దాన్ని ఎంత చక్కగా విప్పామనేది చాలా కీలకం. అదే ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమాలో అలాంటి ఆసక్తి కనపడదు. హేమంత్, కోనవెంకట్ ఆ విషయాలపై మరింత ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేదనిపిస్తుంది. గోపీసుందర్ సంగీతం, గిరీష్ నేపథ్య సంగీతం, ఓకే అనిపిస్తాయంతే..షానిల్ డియో కెమెరాపనితనం బావుంది. లొకేషన్ విజువల్స్ బావున్నాయి. అనుష్క, మాధవన్, మైకేల్, అంజలి, షాలిని పాండే వంటి స్టార్స్ ఉన్న సినిమా కదా.. ఏదో ఉందని అనుకుంటే ఏమీ కనపడదు. అనుష్క మీద అభిమానంతో చూస్తే చూడొచ్చు..
చివరగా... 'నిశ్శబ్దం'గా చూడాలంతే
Read Nishabdham Review in English
- Read in English