‘ఎస్ బ్యాంక్’ ఖాతాదారులకు నిర్మలమ్మ అభయం!
- IndiaGlitz, [Friday,March 06 2020]
ప్రముఖ ‘ఎస్ బ్యాంక్’ నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది.!. ఆర్‌బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో శుక్రవారం ఉదయం ఆ బ్యాంకు ఖాతాదారులు డబ్బు విత్ డ్రా కోసం సదరు బ్యాంక్ ఏటీఎంలకు బారులు తీరారు. ఖాతాదారులెవరూ నెలకు రూ.50,000కు మించి విత్‌డ్రా చేసుకునేందుకు వీల్లేదని యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తదుపరి ప్రకటన వెలువడే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉండనున్నాయి. అయితే ఈ నిధుల కొరత విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు.
మీ డబ్బు సేఫ్..
డిపాజిటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అక్కర్లేదని.. మీ డబ్బు సేఫ్‌గానే ఉంటుందని సీతారామన్ వ్యాఖ్యానించారు. డిపాజిటర్లకు ఎటువంటి నష్టం జరగదని ఆర్‌బీఐ గవర్నర్ తనకు స్పష్టం చేశారని ఆమె చెప్పుకొచ్చారు. ‘నెల రోజుల్లో ఎస్ బ్యాంకు పునరుద్ధరణకు ఒక పథకాన్ని అమలు చేయనున్నాం. ఎస్ బ్యాంకు డిపాజిటర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి డబ్బు భద్రంగా ఉంటుంది.. డిపాజిటర్ల భద్రత కోసం ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది’ అని తెలిపారు. ఎస్ బ్యాంకు సంక్షోభాన్ని పరిష‍్కరించడంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్‌బీఐ కృషిచేస్తోందన్నారు.