తానా ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ ఘన విజయం
- IndiaGlitz, [Sunday,May 30 2021]
ఈసారి జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికలు అమెరికా అధ్యక్ష ఎన్నికలను తలపించాయి. ప్రతిష్మాత్మక ‘తానా’ సంస్థలో పలు కీలకమైన పదవుల కోసం జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులంతా పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. అమెరికాలోని తెలుగువారితో మమేకమై తమను గెలిపించాలని కోరుతూ జోరుగా ప్రచారం సాగించారు. మొత్తానికి ఎన్నికలు.. ఆ తరువాత ఓట్ల లెక్కింపు కూడా పూర్తయింది. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ ఘన విజయం సాధించింది.
తానా తదుపరి అధ్యక్షుడిగా నిరంజన్ ఎన్నికయ్యారు. నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్ కొడాలికి 9,108 ఓట్లు వచ్చాయి. ఓట్ల లెక్కింపు మొదలైనప్పటి నుంచి ఆధిక్యం కనబరిచిన నిరంజన్ ప్యానెల్ చివరికి భారీ మెజారిటీతో గెలుపొందింది. ఈ విజయంతో నిరంజన్ ప్యానెల్ సభ్యులు సంబురాల్లో మునిగిపోయారు. ఇక శృంగవరపు నిరంజన్‌కు తానా ప్రస్తుత అధ్యక్షుడు జయశేఖర్ తాళ్లూరి, అంజయ్య చౌదరిలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వీరి ద్వారా నిరంజన్ ప్యానెల్‌కు సుమారు 1758 ఓట్లు వచ్చినట్లు సమాచారం. కాగా, నరేన్ కొడాలికి మద్దతుగా తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, సతీష్ వేమన ఉన్నారు.