Download App

Ninu Veedani Needanu Nene Review

ఇప్ప‌టి వ‌ర‌కు హీరోగా మెప్పించిన సందీప్ కిష‌న్ నిర్మాత‌గా మారి కార్తీక్ రాజు అనే డెబ్యూ డైరెక్ట‌ర్‌తో చేసిన సినిమా `నిను వీడ‌ని నీడ‌ను నేనే`.  నీ నీడ‌ను నిన్ను చంపాల‌ని చూస్తే.. మ‌న ఒంట్లో దెయ్యం ఉంటుంది.. వెన‌క్కితిరిగి చూడ‌కండి మీవెనుక ఎవ‌రో ఉన్నారు?.. వంటి డిఫ‌రెంట్ లైన్స్‌తో ఈ సినిమా  ప్రమోష‌న్స్ స్టార్ట్ చేశారు. దీంతో  సినిమా హార‌ర్ థ్రిల్ల‌ర్ అనే భావన ప్రేక్ష‌కుల‌కు ఏర్ప‌డింది. ఇక టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లో అయితే హీరో అద్దం చూసుకుంటే మ‌రొక‌రు క‌న‌ప‌డ‌టంతో ఇదేదో ఇంట్రెస్టింగ్‌గా ఉండ‌బోతుందే అనే ఫీలింగ్ క‌లిగింది. అస‌లు `నిను వీడ‌ని నీడ‌ను నేనే` సినిమా ప్రేక్ష‌కుల‌ను ఏ మేర ఆక‌ట్టుకుంది. నిర్మాత‌, హీరోగా సందీప్ స‌క్సెస్ అయ్యారా?  లేదా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే ముందుగా క‌థేంటో చూద్దాం...

క‌థ‌:

సినిమా ప్రారంభం కావ‌డ‌మే 2035లో ప్రారంభం అవుతుంది. పారా సైక్రియాటిస్ట్‌(ముర‌ళీశ‌ర్మ‌)ను పారా సైకాల‌జీ చదువుతున్న కొంత మంది విద్యార్థులు వ‌చ్చి క‌లుస్తారు. ఆయ‌న త‌న ఫ్రొఫెష‌న్‌లో ఫేస్ చేసిన ఓ అసాధార‌ణ కేసుని వివ‌రిచండంతో సినిమా మొద‌ల‌వుతుంది. అర్జున్‌(సందీప్ కిష‌న్‌), మాధ‌వి(అన్య‌సింగ్‌) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.  అనుకోకుండా వారు ప్ర‌యాణిస్తున్న కారుకి పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన కారును శ్మ‌శానంలో వ‌దిలి వెళ్ల‌డం ఇష్టం లేకుండా అదే రోడ్డు ప‌క్క‌న ఉన్న శ్మ‌శానానికి వెళతారు. అక్క‌డ ఎవ‌రూ క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో ఎలాగో ఇంటికి వ‌చ్చేస్తారు. కానీ అక్క‌డ నుండే అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. అద్దాల్లో చూసుకున్న‌ప్పుడు బార్య‌భ‌ర్త‌లిద్ద‌రికీ మ‌రెవరి ముఖ‌మో క‌న‌ప‌డుతుంది. వారి ఫేస్ బుక్‌, వాట్సాప్ ఫొటోల‌ను ఎవ‌రో మార్చేస్తారు. చుట్టూ జ‌రుగుతున్న ప‌రిణామాలు చూసి వారు భ‌య‌ప‌డతారు. అర్జున్ వాళ్ల అమ్మ‌(ప్ర‌గ‌తి)కి అస‌లు విష‌యం తెలియ‌డంతో ఆమె ఓ సైక్రియాటిస్ట్‌(ముర‌ళీశ‌ర్మ‌)ను క‌లుస్తుంది. ఆ సైక్రియాటిస్ట్ అర్జున్, మాధ‌వితో క‌లిసి మాట్లాడుతారు. అదే స‌మ‌యంలో పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి రోడ్డు ప్ర‌మాదం నుండి కేసును ఇన్వెస్టిగేట్ చేయ‌డం మొద‌లు పెడ‌తారు. వారికి ఓ షాకింగ్ విష‌యం తెలుస్తుంది. అదేంటి?  అస‌లు అర్జున్, మాధ‌విల రూపాలు అద్దాల్లో మరోలా ఎందుకు క‌న‌ప‌డ‌తాయి. రిషి, దియా ఎవ‌రు?  చివ‌ర‌కు స‌మ‌స్య ఎలా తీరింది?  అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

స‌మీక్ష‌:

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే... హీరో సందీప్ కిష‌న్ గురించి చెప్పాలి. ఓ సెన్సిటివ్ పాయింట్‌ను న‌మ్మి న‌టించ‌డ‌మే కాదు.. నిర్మాత‌గా కూడా మారారు. అది కూడా ఓ డెబ్యూ డైరెక్ట‌ర్‌ను న‌మ్మి సినిమా చేయ‌డం గొప్ప విష‌య‌మే. న‌టుడిగా ఎమోష‌న‌ల్ క్యారెక్ట‌ర్‌ను చ‌క్క‌గా క్యారీ చేశాడు. తొలి హాఫ్‌లో హార‌ర్ ఎలిమెంట్స్ మిక్స్ అయిన స‌న్నివేశాల్లో సందీప్‌, అన్య చ‌క్క‌గా న‌టించారు. ఇక సందీప్ గా క‌న‌ప‌డే వెన్నెల‌కిశోర్ త‌న ఎక్స్‌ప్రెష‌న్స్‌తో న‌వ్వించాడు. ఇక కేసుని ఇన్వెస్టిగేట్ చేసే పోలీస్ ఆఫీస‌ర్‌గా పోసాని కృష్ణ‌ముర‌ళి త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌తో కామెడీని పండించాడు. ఈయ‌న పాత్ర క‌న‌ప‌డిన‌ప్పుడ‌ల్లా కామెడీ క్రియేట్ అయ్యింది. ఇక సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే.. ప్రేక్ష‌కుడిని ఎమోష‌న‌ల్ కంటెంట్‌ను తీసుకెళ్లారు. హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్‌ట్రాక్తో పాటూ వారి ఫ్యామిలీ బాండింగ్‌ను రివీల్ చేసి దానికి  క్లైమాక్స్‌లో సెంటిమెంట్‌ను యాడ్ చేసి చిత్రీక‌రించారు. త‌ల్లీకొడుక‌లు సెంటిమెంట్‌తోపాటు.. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్ బావుంది. మాళ‌వికా నాయ‌ర్ చిన్న పాత్ర‌లో త‌ళుక్కున మెరిసింది. సినిమాకు చివ‌రి స‌న్నివేశానికి ఓ లింక్ పెట్టాడు ద‌ర్శ‌కుడు. ప్ర‌గ‌తి, మ‌హేశ్ విట్టా త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ద‌ర్శ‌కుడు కార్తీక్ రాజు ఓ సోష‌ల్ పాయింట్‌ను హారర్‌, థ్రిల్ల‌ర్ అంశాల‌తో మిక్స్ చేసి చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. హీరో, హీరోయిన్ మ‌ధ్య  ల‌వ్ ఎలిమెంట్స్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. అలాగే.. హీరో, హీరోయిన్‌కు ఫ్యామిలీ బాండింగ్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేశారు. అయితే ఫ‌స్టాఫ్ అంతా హార‌ర్‌, థ్రిల్ల‌ర్ ఎలిమెంట్స్‌తో ఏం జ‌రిగిందో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ప్రేక్ష‌కుడిలోనూ క‌లుగుతుంది. అయితే ప్రేక్ష‌కుడు ఊహించే పాయింట్‌ను కాకుండా ఎమోష‌న‌ల్‌, చిన్న మెసేజ్ మిక్స్ చేసి అంశాలు యూత్ ప్రేక్ష‌కుడికి ఏమేర ఆక‌ట్టుకుంటాయో తెలియ‌దు. త‌మ‌న్ సంగీతంలో పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ బావున్నాయి. ప్ర‌మోద్ వ‌ర్మ సినిమాటోగ్ర‌ఫీ చాలా బావుంది. ఛోటా కె.ప్ర‌సాద్ ఎడిటింగ్ వ‌ర్క్ బావుంది. అయితే సినిమా ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్ నెమ్మ‌దిగా అనిపించ‌డం.. ఎమోష‌న్స్‌ను యూత్‌కు క‌నెక్ట్ అవుతుందా?  అనే అంశాలే సినిమాలో ఆలోచించాల్సిన విష‌యాలు.

బోట‌మ్ లైన్‌: 'నిను వీడ‌ని నీడ‌ను నేనే'.. హారర్, థ్రిల్ల‌ర్ అంశాలే కాదు.. ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో సాగే సినిమా

Read 'Ninu Veedani Needanu Nene' Movie Review in English

Rating : 3.0 / 5.0