ఏపీ సర్కార్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చిన నిమ్మగడ్డ!
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిదే. ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నామని.. ఎన్నికలు ఎప్పడనేది తదుపరి ప్రకటన చేస్తామని ఎస్ఈసీ ప్రకటించారు. అయితే.. ఈ వాయిదా వ్యవహారంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఏపీ సీఎం నువ్వా నేనా..? అసలు ఇలాంటి ప్రకటన చేసే అధికారం..?, కలెక్టర్లు, ఎస్పీ, ఎస్సైలు, పోలీసు అధికారులను ట్రాన్స్‌ఫర్ అధికారం మీకెక్కడిది..? అంటూ మీడియా సమావేశం పెట్టి మరీ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్‌ను కలిసి జగన్ ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాయిదా రగడ నెలకొంది.
విమర్శలు తిప్పికొట్టిన రమేష్!
సోమవారం నాడు రమేష్‌ను పిలిపించుకుని గవర్నర్ మాట్లాడారు. అనంతరం రమేష్ కీలక ప్రకటన చేస్తారని అందరూ అనుకున్నప్పటికీ అదేమీ జరగలేదు. మంగళవారం నాడు ఈ మేరకు మూడు పేజీల కీలక లేఖను సీఎస్ నీలం సాహ్నీకి రాశారు. ఈ లేఖ ద్వారా ఎన్నికల వాయిదా తర్వాత ఎన్నికల సంఘంపై చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. ఎన్నికల వాయిదా వల్ల ఆర్థిక సంఘం నిధులు రావనేది అసత్యమని.. తాను ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేశానన్న విషయాన్ని రమేష్ గుర్తు చేశారు. గతంలో ఇలాంటి సందర్భాల్లోనూ నిధులు డ్రా చేశారని చెప్పుకొచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు, కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని లేఖలో ఆయన నిశితంగా వివరించారు.
స్ట్రాంగ్ కౌంటర్!
‘కరోనా వైరస్ వల్ల మహారాష్ట్ర, బెంగాల్, ఒడిశాలోనూ ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లతో టచ్‌లో ఉన్నాం. గోవాలో కూడా స్థానిక ఎన్నికలు వాయిదాపై పరిశీలిస్తున్నారు. ఈనెల 14న కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శితో మాట్లాడాను. రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శితో నిరంతరం ఫోన్‌లో టచ్‌లో ఉన్నా కాల్ డేటా కూడా నా దగ్గరుంది. ప్రభుత్వానికి ఆరోగ్యశాఖ అధికారులు సమాచారం ఇవ్వకుంటే ఎన్నికల కమిషన్‌పై నిందలువేయడం సరికాదు’ అని విమర్శలకు ఎస్ఈసీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఆ విషయం మర్చిపోవద్దు!
‘కరోనాపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శితో రాష్ట్రం సంప్రదింపులు జరుపుతుందో లేదో నాకు తెలియదు. కేంద్ర టాస్క్‌ఫోర్స్ ఎలాంటి ప్రమాదం లేదని చెబితే 6వారాల్లో ఎన్నికల నిర్వహణపై పరిశీలిస్తాం. ఇప్పటికే దేశంలో కరోనా వైరస్ స్టేజ్ 2కు చేరుకుందన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీరు నిన్న రాసిన లేఖ మీడియాలో వచ్చింది.. నేను రాసిన లేఖ కూడా మీడియాకు విడుదల చేయడం తప్పడం లేదు. ప్రజాశ్రేయస్సు దృష్ట్యా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ నిందారోపణలు చేస్తున్నారు. వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడుతున్నారు’ అని ఎస్‌ఈసీ రమేష్‌కుమార్ లేఖలో పేర్కొన్నారు.
సీఎస్ లేఖలో ఏముంది..!?
ఈ క్రమంలో.. జగన్ ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్‌కు ఏపీ సీఎస్ నీల సాహ్ని లేఖ రాశారు. ఎన్నికలు యథావిథిగా జరపాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదని.. కరోనా నియంత్రణకు వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టిందని నిశితంగా లేఖలో రాసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణకు అడ్డంకి కాకుండా కరోనా నియంత్రణ చేపట్టవచ్చని.. అవసరమైతే పోలింగ్ రోజున జనం గుమిగూడకుండా నియంత్రించవచ్చని కూడా సీఎస్ లేఖలో రాశారు.
ఏం తేలుతుందో..!
ఇదిలా ఉంటే ఎన్నికలు యథావిథిగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం కోర్టు మెట్లెక్కింది. ఈ సందర్భంగా.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన సర్కార్ ఎన్నికల నిర్వహణకు సహకరించేలా చూడాలని కోరింది. ఇవాళ ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పురానుంది. మరోవైపు.. ఎన్నికలు వెంటనే జరిపించాలంటూ హైకోర్టులోనూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. అయితే కోర్టులు ఏం తేల్చబోతున్నాయ్..? యథావిధిగా ఎన్నికలు జరిపాలని కోర్టులు తీర్పునిస్తాయా..? లేకుంటే జగన్ సర్కార్‌కు మరో షాక్ ఇస్తాయా..? అనే విషయం తెలియాలంటే ఇవాళ సాయంత్రం వరకూ వేచి చూడాల్సిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments