షూటింగ్‌లో గాయపడిన నిఖిల్

  • IndiaGlitz, [Wednesday,March 10 2021]

యంగ్ హీరో నిఖిల్ షూటింగ్‌లో గాయపడ్డాడు. ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా.. ఈ యాక్సిడెంట్ జరిగింది. నిఖిల్‌, విలక్షణ దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'కార్తికేయ 2'. ప్రస్తుం ఈ చిత్రం గుజరాత్‌లో షూటింగ్‌ జరుపుకుంటోంది. అయితే చిత్రంలో ఒక కీలక సన్నివేశమైన మెయిన్ యాక్షన్‌ సీన్‌ను చిత్రీకరిస్తుండగా.. యాక్సిడెంట్‌ అయినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో హీరో నిఖిల్‌కి స్వల్ప గాయాలు అవడంతో.. వెంటనే షూటింగ్‌ నిలిపివేశారు. ప్రస్తుతం నిఖిల్ కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.

ఆ క్రమంలోనే మరికొన్ని రోజుల పాటు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ నిలిపివేయనున్నారని సమాచారం. నిఖిల్ కాలి గాయంతో బాధపడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే.. నిఖిల్‌ ఆరోగ్యం విషయంలో అభిమానులెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఆయనకి స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని.. ప్రస్తుతం ఆయన చక్కగానే ఉన్నారని చిత్ర యూనిట్‌ వర్గాలు వెల్లడించాయి.

నిఖిల్‌, చందు మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన 'కార్తికేయ' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'కార్తికేయ 2' రూపొందుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ సైతం ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. రీసెంట్‌గా చిత్రయూనిట్‌ అధికారికంగా ప్రకటించింది.