ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ : తెలంగాణ అమ్మాయి జరీన్‌కు స్వర్ణం.. కేసీఆర్, చంద్రబాబు, పవన్ అభినందనలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించారు. టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాన్ని సాధించింది. 52 కిలోల విభాగంలో భాగంగా గురువారం జరిగిన ఫైనల్లో థాయిలాండ్‌కు చెందిన జిట్ పాంగ్‌ను 5-0 తేడాతో ఓడించింది. తద్వారా ప్రపంచ బాక్సింగ్‌లో ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా రికార్డుల్లోకెక్కింది. అంతేకాదు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఐదో భారత బాక్సర్‌గా నిలిచింది. గతంలో మేరీ కోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ కేసీలు ఈ ఘనత అందుకున్నారు. జరీన్ ఛాంపియన్‌గా అవతరించడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఫైనల్ నేపథ్యంలో ఆమె తండ్రి జమీల్, బాక్సింగ్ కోచ్‌లు, క్రీడాకారులు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మ్యాచ్ లైవ్ వీక్షించారు .
మరోవైపు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన జరీన్‌కు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభినందనలు తెలిపారు. ఆమెను చూసి రాష్ట్రం గర్విస్తోందన్నారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం జరీన్‌ను అభినందించారు. ఆమె విజయం రాష్ట్రానికి గర్వకారణమని.. క్రీడాకారులను తమ ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తోందన్నారు. యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు కేసీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. జరీన్‌కు మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యక్తిగతంగా లక్ష రూపాయలు ప్రకటించారు.
అటు ఏపీ ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం నిఖత్ జరీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పురుషాధిక్య ప్రపంచంలో ఎన్నో అడ్డంకులను అధిగమించి ఆమె గుర్తింపు తెచ్చుకుందని.. జరీన్ ప్రయాణం అందరికీ స్పూర్తి అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం జరీన్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘‘ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో విజేతగా నిలిచిన భారతీయ మహిళా బాక్సర్, తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ కు జనసేన హృదయపూర్వక అభినందనలు. ఫైనల్స్ లో బౌట్ ఆరంభం నుంచి ఆధిపత్యం చూపిస్తూ రింగ్ లో దూకుడుగా ఆడిన విధానం ప్రశంసనీయం. నిఖత్ జరీన్ క్రీడా ప్రస్థానం, విజయాలు యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments