మెగా డాటర్ నిహారిక వివాహ తేదీ ఫిక్స్...

  • IndiaGlitz, [Thursday,November 05 2020]

కరోనా మహమ్మారి... ఇప్పట్లో కంట్రల్‌లోకి వచ్చే సూచనలైతే కనిపించట్లేదు. దీంతో టాలీవుడ్‌లో వరుసగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇప్పటికే యంగ్ హీరోలు నిఖిల్, నితిన్, రానా.. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మెగా డాటర్ కొణిదెల నిహారిక కూడా పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతోంది.

మెగా డాటర్ నిహారిక కొణిదెల వివాహానికి ముహూర్తం ఫిక్స్ అయింది. నిహారిక వివాహం గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో నిశ్చయమైన సంగతి తెలిసిందే. వీరి నిశ్చితార్థం ఈ ఏడాది ఆగస్ట్‌లో హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. కాగా.. నిహారిక, చైతన్యల వివాహం డిసెంబర్ 9న 7 గంటల 15 నిమిషాలకు జరగనుంది. వీరి వివాహానికి రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ నగరంలోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్‌ వేదిక కానుందని చైతన్య తండ్రి, గుంటూరు ఐజీ జె.ప్రభాకర్ తెలిపారు.

బుధవారం ప్రభాకరరావు దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని పెళ్లి శుభలేఖను స్వామివారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివాహ తేదీని వెల్లడించారు. కాగా.. పెళ్లి పనులు కూడా మెగా వారింట ఇప్పటికే మొదలయ్యాయి. మరోవైపు ప్రభాకర్ ఇంట కూడా పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి.