Niharika:పరస్పర అంగీకారంతోనే విడిపోయాం .. అర్ధం చేసుకోండి, కొంచెం ప్రైవసీ కావాలి : విడాకులపై నిహారిక రియాక్షన్

  • IndiaGlitz, [Wednesday,July 05 2023]

మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక తన భర్త జొన్నలగడ్డ చైతన్యతో కొన్నాళ్లుగా విడిగా వుంటున్న సంగతి తెలిసిందే. దీంతో మీడియాలో రకరకాల కథనాలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తమ వైవాహిక బంధంపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు నిహారిక. తనకు హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు మంజూరు చేయాల్సిందిగా కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టులో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. గంటల వ్యవధిలోనే దీనిపై అధికారికంగా ప్రకటన చేశారు నిహారిక. ఈ మేరకు బుధవారం ఆమె ఓ పోస్ట్ పెట్టారు.

‘‘ నేను, చైతన్య పరస్పర అంగీకారంతోనే విడిపోయాలని నిర్ణయించుకున్నాం. తన వెన్నంటే వుండి.. తనకు ఎంతో అండగా నిలిచిన నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. ఈ పరిణామాల నేపథ్యంలో మా జీవితాల్లో మేం ముందుకు వెళ్లేందుకు కొంత ప్రైవసీ ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాం. నన్ను అర్ధం చేసుకున్నందుకు థ్యాంక్స్’’ అని రాసుకొచ్చింది. అయితే అందరు సెలబ్రెటీ కపుల్స్ మాదిరిగానే నిహారిక - చైతన్య ఎందుకు విడిపోతున్నారో మాత్రం చెప్పలేదు.

జైపూర్‌లో నిహారిక-చైతన్యల వివాహం :

కాగా.. నిహారిక-చైతన్యలు పెద్దల కుదిర్చిన సంబంధం ద్వారా ఒక్కటయ్యారు. ఐపీఎస్ అధికారి జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడైన చైతన్యతో 2020 ఆగస్టు 13న నిహారికకు ఘనంగా ఎంగేజ్‌మెంట్ అయ్యింది. కొద్దినెలల గ్యాప్‌లో డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని జైపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా చూడముచ్చటగా వున్న ఈ స్టార్ కపుల్.. కొన్నాళ్ల పాటు హాయిగానే కాపురం చేసుకుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో నిహారికకు సంబంధించిన ఫోటోలను చైతన్య డిలీట్ చేశారు. అప్పుడే సినీ జనాలకు, ప్రజలకు వ్యవహారం ఏదో తేడా కొట్టింది. ఆ కొన్నాళ్లకే నిహారిక కూడా తన సోషల్ మీడియా ఖాతాల్లో వున్న భర్త ఫోటోలను, వీడియోలను తొలగించింది. ఈ పరిణామంతో నిహారిక విడాకులు ఖాయమని అందరికీ అర్ధమైంది.

ఫలించని రాజీ యత్నాలు :

కొన్నినెలలుగా నిహారిక, చైతన్య విడివిడిగా వుంటున్నారు. కుటుంబ కార్యక్రమాలు, శుభకార్యాల్లోనూ వేర్వేరుగా పాల్గొంటున్నారు. అంతేకాదు.. ఇటీవల జరిగిన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌కు కూడా నిహారిక ఒక్కరే హాజరయ్యారు. అలాగే ప్రొడక్షన్‌లోకి దిగిన నిహారిక సొంతంగా ఆఫీస్ ఓపెన్ చేశారు. ఈ కార్యక్రమానికి చైతన్య హాజరుకాకపోగా.. కనీసం విష్ చేయలేదు. అయితే భార్యాభర్తలను కలిపేందుకు పెద్దలు ప్రయత్నించినప్పటికీ లాభం లేకపోయింది. చివరికి నిహారిక విడాకులు కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.