ఏపీలో జూన్ 10 వరకూ కర్ఫ్యూ
- IndiaGlitz, [Monday,May 31 2021]
రాష్ట్రంలో జూన్ 10 వరకూ కర్ఫ్యూ పొడిగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ప్యూ వేళలను మాత్రం యధాతథంగా అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ ఆంక్షలు సోమవారంతో ముగియనున్నాయి. దీంతో ఆంక్షల పొడిగింపుపై ముఖ్యమంత్రి జగన్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంది. అదే విధానాన్ని ఇకపై కూడా కొనసాగించనున్నారు.
కేసులు తగ్గుముఖం పట్టినా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. కర్ఫ్యూకు ముందు కేసుల సంఖ్య భారీగా ఉండేది. కర్ఫ్యూ అనంతరం కాస్త అదుపులోకి వచ్చింది. తాజాగా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. కర్ఫ్యూ సత్ఫలితాలను ఇస్తుండటంతో జగన్ దీనిని కొనసాగించాలని నిర్ణయించారు. అలాగే 14 మెడికల్ కాలేజీలకు వర్చువల్ విధానంలో జగన్ శంకుస్థాపన చేశారు. 2023 నాటికి మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. 7880 కోట్లతో 14 మెడికల్ కాలేజీల నిర్మాణం జరుగుతుందని సీఎం జగన్ వెల్లడించారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఉంటాయని తెలిపారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా 500 పడకల ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని జగన్ వెల్లడించారు. మండలానికి రెండు పీహెచ్‌సీలు, ప్రతి గ్రామంలో వైఎస్సార్ క్లినిక్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ పేర్కొన్నారు.