జగన్‌ పై దాడి కేసు: ఎన్ఐఏ గుట్టు విప్పబోతోందా..!

  • IndiaGlitz, [Tuesday,January 08 2019]

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు ఎన్‌‌ఐఏ చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. తీవ్ర నాటకీయ పరిణామాల మధ్య ఈ కేసు ఎన్ఐఏకు చేరింది. ఎన్‌‌ఐఏ ఆధ్వర్యంలోకి రావడంతో రంగంలోకి దిగిన అధికారులు అసలేం జరిగింది..? ఈ కుట్ర వెనుక ఎవరున్నారు..? అసలు కారకులెవరు..? ఎవరి డైరెక్షన్‌లో ఇదంతా జరిగిందనే గుట్టును విప్పడానికి సుధీర్ఘంగా దర్యాప్తు చేస్తోంది.

ఈ క్రమంలో ఏపీ పోలీసులను కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని అధికారులు కోరింది. అయితే ఏపీ పోలీసులు మాత్రం ఏ మాత్రం సహకరించడంతో మంగళవారం నాడు ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించి ఈ వ్యవహారంపై మెమో దాఖలు చేసింది. ఈ కేసును హియరింగ్‌కు వస్తే విజయవాడ కోర్టుకు బదలాయించి.. నిందితుడు శ్రీనివాసరావును కస్టడీ కూడా కోరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

శ్రీనివాసరావును విచారిస్తే పరిస్థితేంటి..!?

ఈ దాడి జరిగినప్పట్నుంచి జరిగిన పరిణామాలన్నీ అందరికీ గుర్తుండే ఉంటాయి. మరీ ముఖ్యంగా నిందితుడు శ్రీనివాసరావు పొంతనలేని సమాధానాలు చెప్పడం.. మరోవైపు తెలుగు తమ్ముళ్లు సైతం స్పందించిన తీరుతో తెలుగు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. శ్రీనివాసరావును కస్టడీ తీసుకుంటే నిజానిజాలను అధికారులు నిగ్గు తేల్చుతురా..? అసలేం జరిగిందనే విషయాలన్నీ బయటపడతాయ్.. ఎన్ఐఏ గుట్టు విప్పుతుందనే వైసీపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ నెల చివరికల్లా ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.