ఈ వేసవి చాలా ప్రత్యేకం. ఎండలు ఓ వైపు మండిపోతుంటే, మరోవైపు పొలిటికల్ హీట్ మనుషులను పట్టి కుదిపేసింది. దేశవ్యాప్తంగా రాజకీయ సెగ మామూలుగా లేదు. నిన్నటికి నిన్న ఇటు జగన్, అటు నరేంద్రమోదీ కూడా ప్రమాణ స్వీకారాలు చేశారు. ప్రజలు ఇంకా రాజకీయ మూడ్ నుంచి బయటపడనే లేదు. ఆ పొలిటికల్ హీట్ శుక్రవారం నుంచి వెండితెరమీద కూడా మొదలు కానుంది. సూర్య నటించిన `ఎన్.జి.కె` రూపంలో. ఈ సినిమా పూర్తిగా పొలిటికల్ చిత్రం. చక్కటి భావోద్వేగాలు, ఇద్దరు హీరోయిన్లతో ఎమోషనల్‌గా తెరకెక్కించామని యూనిట్ అన్నారు. అదంతా ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుందా? సొసైటీలో కనిపించే సినారియో, సిల్వర్ స్క్రీన్ మీద ట్రాన్స్ ఫర్ అయిందా? ఇంతకీ `ఎన్.జి.కె`లో ఏం చెప్పారు... రివ్యూలోకి వెళ్దాం.
కథ:
నందగోపాల కృష్ణ అలియాస్ ఎన్.జికె(సూర్య) ప్రజలకు తనకు తోచిన రీతిలో సహాయపడుతూ ఉంటాడు. ఎం.టెక్ చదివినా ప్రజా సేవ అంటూ తిరిగే కొడుకును తల్లిదండ్రులు (నిరల్‌గల్ రవి, ఉమా పద్మనాభన్), భార్య గీతాకుమారి(సాయిపల్లవి) కూడా ఏమీ అనరు. అయితే సమాజానికి సేవ చేయకుండా రాజకీయనాయకులు పదవులను అనుభవిస్తున్నారని గోపాల్ బాధపడుతుంటాడు. కొన్ని పరిస్థితుల్లో ప్రతి పక్షంలోని తన ఊరి ఎమ్మెల్యే దగ్గర అనుచరుడిగా జాయిన్ అవుతాడు. క్రమంగా అతని నమ్మిన బంటుగా మారుతాడు. అక్కడ నుండి పార్టీ అధిష్టానం దృష్టికి వెళతాడు. పార్టీ అధిష్టాన పి.ఆర్ హెడ్ వనిత(రకుల్ ప్రీత్ సింగ్), గోపాల్‌లోని వేగాన్ని గమనించి ఓ సహాయం అడుగుతుంది. అక్కడ నుండి కథ మలుపులు తీసుకుంటుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సీక్రెట్ తెలుసుకున్న గోపాల్.. అతని ప్రభుత్వం పడిపోకుండా ఆపుతాడు. కానీ ముఖ్యమంత్రి అతన్ని చంపాలని చూస్తాడు. అప్పుడు గోపాల్ ఏం చేస్తాడు? గోపాల్‌కి తన పార్టీ నాయకులు ఎంత వరకు సపోర్ట్ చేస్తారు? చివరకు గోపాల్ ఏం సాధించాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
- సూర్య నటన
- కెమెరా పనితనం
మైనస్ పాయింట్స్:
- కథ, కథనం
- సంగీతం
- తిక మకగా సాగడం
సమీక్ష:
ముందు నటీనటుల విషయానికి వస్తే హీరో సూర్య గురించి చెప్పుకోవాలి. ఇన్నేళ్ల ప్రయాణంలో సూర్య టచ్ చేయని జోనర్. అలాగే వైవిధ్యమైన చిత్రాలను తెరెక్కించే దర్శకుడు శ్రీరాఘవ కూడా ఇలాంటి జోనర్‌ను టచ్ చేయలేదు. యువత రాజకీయాల్లో రావాలి. తప్పును ప్రశ్నించాలి. రాజకీయ నాయకులు ప్రజలకు అండగా ఉండాలి. ఇన్ని పాయింట్స్‌ను దర్శకుడు ఒకే కథలో చెప్పాలనుకోవడం బాగానే ఉంది కానీ.. ఓ క్రమ పద్ధతిలో సినిమాను తెరకెక్కించి ఉంటే బావుండేది. సినిమా గమనం కాసేపు అటు, ఇటు పరిగెడుతుంటుంది. శ్రీరాఘవ సినిమాలో పాత్రలు కొన్ని సందర్భాల్లో విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. ఈ సినిమాలో కూడా పాత్రలను శ్రీరాఘవ అలాగే చూపించాడు. సాయిపల్లవి, భర్త పాత్రలోని సూర్యతో ఎప్పుడు ప్రేమగా ఉంటుందో, ఎప్పుడు కోపంగా ఉంటుందో అర్థం కాదు.. అనవసరమైన విషయానికి రాద్ధాంతం చేస్తుంటుంది. ఇక రకుల్ ప్రీత్ పాత్రకు ఇచ్చిన బిల్డప్‌కు, పాత్రలో ఆమెకున్న ప్రాధాన్యతకు సంబంధమే ఉండదు. శ్రీరాఘవ ప్రెజెంట్ పొలిటిక్ సినారియోకు దూరంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నిరల్ గల్ రవి, ఉమాపద్మనాభన్, దేవరాజ్ తదిరులందరూ వారి వారి పాత్రల పరిధి మేర చక్కగా నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతంలో రెండు ట్యూన్స్ మాత్రమే బావున్నాయి. నేపథ్య సంగీతం పరావాలేదు. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బావుంది. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి.
బోటమ్ లైన్: తికమకపడ్డ నందగోపాల కృష్ణుడు
Comments