పునీత్ మరణం: పెళ్లిమండపంలోనే అప్పుకు నివాళి అర్పించిన కొత్తజంట
Send us your feedback to audioarticles@vaarta.com
కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణంతో యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఆయననే దైవంగా భావించే అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా కొత్తగా పెళ్లిన నవదంపతులు పెళ్లి మండపంలోనే పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు శ్రద్ధాంజలి ఘటించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మైసూరు సిద్ధార్థ నగరలోని కనక భవనంలో ఆదివారం మను కిరణ్, లావణ్య అనే నూతన జంట వివాహం జరిగింది.
పెళ్లితంతు ముగిసిన వెంటనే అకాల మరణం చెందిన సినీనటుడు పునీత్ రాజ్‌కుమార్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలు వేసి నివాళి అర్పించారు. అతిథులు సైతం కొత్త జంటని ఆశీర్వదించడంతో పాటు పునీత్‌కు శ్రద్దాంజలి ఘటించారు. అందరిలోనూ పెళ్లి సంతోషం కంటే పునీత్ దూరమయ్యాడన్న బాధే ఎక్కువగా వ్యక్తమైంది. మరోవైపు పునీత్ మరణాన్ని తట్టుకోలేక ఒక అభిమాని కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం సాయంత్రం మైసూరు జిల్లాలోని కేఆర్ నగర పట్టణంలో ఈ దారుణం చోటు చేసుకుంది.
కాగా.. గుండెపోటుతో మరణించిన పునీత్ రాజ్‌కుమార్ అంత్యక్రియలు ఆదివారం ఉదయం బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో ముగిశాయి. తన తల్లిదండ్రుల సమాధి చెంతనే పునీత్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన అన్న రాఘవేంద్ర కుమారుడు వినయ్ రాజ్‌కుమార్ బాబాయ్ అంత్యక్రియలు నిర్వహించారు. పునీత్‌కు మగపిల్లలు లేకపోవడంతో రాఘవేంద్ర చేతుల మీదుగా అంత్యక్రియలు జరిపించాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వినయ్ హీరోగా నిలదొక్కుకోవడానికి పునీత్ ఎంతో సహాయపడ్డారు. ఆ రకంగా బాబాయ్ రుణం తీర్చుకున్నారు వినయ్. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సహా అనేక మంది సినీ, రాజకీయ ప్రముఖులు పునీత్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com