ఇండియాలో ప్రభాస్, పృథ్విరాజ్.. వర్చువల్ ప్రొడక్షన్ విప్లవం మొదలు
Send us your feedback to audioarticles@vaarta.com
ఫిల్మ్ మేకింగ్ అనేది స్థిరమైన ప్రక్రియ కాదు. కాలానుగుణంగా, టెక్నాలజీ పరంగా అనేక మార్పులు వస్తుంటాయి. త్వరలో ప్రపంచం మొత్తం సినిమా నిర్మాణంలో సరికొత్త సాంకేతిక విప్లవం రాబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అదే.. వర్చువల్ ప్రొడక్షన్. ఇప్పటికే హాలీవుడ్ లో మొదలైంది. ఇండియాని కూడా టచ్ చేసింది. ఇక అందరూ ఈ కొత్త టెక్నాలజీకి అప్ గ్రేడ్ కావడమే మిగిలి ఉంది.
ఏంటి ఈ వర్చువల్ ప్రొడక్షన్
వర్చువల్ ప్రొడక్షన్ గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు ఉపయోగిస్తున్న విధానంపై అవగాహన ఉండాలి. ప్రస్తుతం సినిమాలని సెట్స్ లో గ్రీన్ మ్యాట్ లేదా బ్లూ మ్యాట్ ఉపయోగించి షూట్ చేస్తారు. ఎక్కువగా ఉపయోగించేది గ్రీన్ మ్యాటే. గ్రీన్ అనేది హ్యూమన్ బాడీ తో సింక్ అవ్వదు. సో సిజి వర్క్ లో గ్రీన్ ని సులభంగా తొలగించి విజువల్ ఎఫెక్ట్స్ అప్లయ్ చేయవచ్చు. క్రామ కీ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోస్ట్ ప్రొడక్షన్ లో దర్శకులు ఈ పని చేయించుకుంటారు.
అంటే తాము ఎలాంటి లొకేషన్ లో నటిస్తున్నాము, ఎలాంటి పరిస్థితుల్లో నటిస్తున్నాము అనేది నటీనటులు దర్శకుల నుంచి తెలుసుకుని, ఇమాజిన్ చేసుకుని నటించాల్సి ఉంటుంది. ఇప్పుడొస్తున్న వర్చువల్ ప్రొడక్షన్ అలా కాదు. నటీనటులు నటించాల్సిన బ్యాగ్రౌండ్ ని భారీ ఎల్ ఈ డి వాల్స్ ఉపయోగించి ఏర్పాటు చేస్తారు. ఉదాహరణకు ఓ నటుడు కొండ ప్రాంతంలో నటించాలి అంటే.. చుట్టూ ఎల్ ఈ డి వాల్స్ ఏర్పాటు చేసి అందులో కొండ విజువల్స్ ప్లే చేస్తారు. అప్పుడు నటుడు లొకేషన్ కు తగ్గట్లుగా నటించే వీలు ఉంటుంది.
బిగ్గెస్ట్ అడ్వాంటేజ్
విర్చువల్ ప్రొడక్షన్, ఎల్ ఈ డి వాల్స్ టెక్నాలజీ వల్ల దూరమైన షూటింగ్ లొకేషన్స్ కి చిత్ర యూనిట్ ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. భారీగా సెట్స్ వేసుకోవలసిన అవసరం కూడా ఉండదు. ఉదాహరణకు దర్శకుడికి ఓ రైల్వే స్టేషన్ సెటప్ కావాలంటే.. ఎల్ఈడీ వాల్స్ లోనే బ్యాగ్రౌండ్ లో రైల్వే స్టేషన్ చూపించవచ్చు. వాల్స్ మధ్యలో నటీనటులు నటిస్తారు. తర్వాత రెండు విజువల్స్ ని పర్ఫెక్ట్ గా సింక్ చేసుకోవచ్చు.
సెట్స్ వేయాల్సిన అవసరం లేకపోవడం, షూటింగ్ లొకేషన్స్ కి నటీనటులతో భారీ ఖర్చుతో ప్రయాణించక పోవడం వల్ల ప్రొడక్షన్ కాస్ట్ ఏ రేంజ్ లో తగ్గుతుందో ఊహించుకోవచ్చు. దీనికున్న అడ్వాంటేజస్ వల్ల ఫిలిం మేకర్స్ నెమ్మదిగా ఈ న్యూ జనరేషన్ టెక్నాలజీపై ఫోకస్ పెడుతున్నారు.
పోస్ట్ ప్రొడక్షన్ లో చూసుకోవచ్చులే..
ప్రస్తుతం గ్రీన్ మ్యాట్ టెక్నాలజీలో ఏవైనా పొరపాటు జరిగితే పోస్ట్ ప్రొడక్షన్ లో సరిచేసుకోవచ్చులే అనే మాట ఫిలిం మేకర్స్ నుంచి వినిపిస్తూ ఉంటుంది. కానీ విర్చువల్ ప్రొడక్షన్ వల్ల విజువల్ ఎఫెక్ట్స్ అనేది ఇకపై పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ గా ఉండబోదని అంటున్నారు. ఒక సన్నివేశానికి విజువల్ ఎఫెక్ట్స్ జోడించడం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. కానీ విర్చువల్ విధానం ద్వారా ముందుగానే ఆ సీన్ కి విఎఫెక్స్ జోడించవచ్చు. అదికూడా ప్రీ ప్రొడక్షన్ లోనే. అంటే ఓకే ఒక నటుడు ఎలాంటి పరిస్థితిలో నటిస్తున్నాడు అనేది ముందుగానే నిర్ణయించబడుతుంది.
అదే పనిలో హాలీవుడ్
ఈ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునే పనిలో ఉంది హాలీవుడ్. ది మాండలోరియన్ అనే భారీ సిరీస్ కు ఈ విర్చువల్ ప్రొడక్షన్ ని ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ వర్కింగ్ వీడియోల్ని రిలీజ్ చేసింది. భారీ ఎల్ఈడీ వాల్స్ మధ్యలో నటీనటులు నటిస్తున్నారు. థిక్ ఫారెస్ట్ సెటప్ ని ఎల్ ఈడీ వాల్స్ ద్వారా క్రియేట్ చేశారు. దీనితో తాము అడవిలో ఉన్నట్లు ఊహించుకుని నటీనటులు నటిస్తున్న దృశ్యాలని మాండలోరియన్ యూనిట్ రిలీజ్ చేసింది. అలాగే అవతార్ చిత్రాన్ని కూడా ఈ విధానంతోనే చిత్రీకరించారు.
ఎల్ఈడీ వాల్స్ ప్రత్యేకతలు
1930లోనే బ్లూ మ్యాట్ తో చిత్రీకరణ మొదలైంది. ఆ తర్వాత గ్రీన్ మ్యాట్ వినియోగంలోకి వచ్చింది. ఇక 1990 నుంచి గ్రీన్ మ్యాట్ వినియోగం కామన్ గా మారిపోయింది. ఇప్పుడొస్తున్న వర్చువల్ ప్రొడక్షన్ లో ఉపయోగిస్తున్న ఎల్ఈడీ వాల్స్ అనేక ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. 'ది మాండలోరియన్' కోసం అయితే ఏకంగా 1326 ఎల్ఈడీ స్క్రీన్స్ ఉపయోగించారు. ఈ స్క్రీన్స్ 2.84 ఫిక్సల్ పిచ్ తో ఉంటాయి. 20 అడుగుల పొడవు,75 అడుగుల వెడల్పు ఉండే ఈ స్క్రీన్స్ ని 270 డిగ్రీల కోణంలో ఉపయోగించారు.
మొదలెట్టిన ప్రభాస్, మలయాళీ స్టార్
ఈ విర్చువల్ ప్రొడక్షన్ అనేది ఇండియాలోకి కూడా దూసుకొచ్చేసింది. ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ లాంటి బడా హీరోల చిత్రాలకు ఈ విర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రంలో కొన్ని సన్నివేశాల్ని ఈ విధానంతో రూపొందిస్తున్నారట. రాధేశ్యామ్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్న మనోజ్ పరమహంస ఇప్పటికే ఈ విషయాన్ని తెలియజేశారు. ఇండియాలో మొట్ట మొదటిసారిగా విర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని ప్రభాస్ చిత్రం కోసం ఉపయోగిస్తున్నాం అంటూ మనోజ్ గతంలో ప్రకటించారు.
ఇక మలయాళీ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఓ భారీ మైథాలజీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పూర్తిగా వర్చువల్ ప్రొడక్షన్ లోనే షూట్ చేయనున్నారట. తొలిసారి ఇండియాలో పూర్తిస్థాయిలో వర్చువల్ ప్రొడక్షన్ ద్వారా చిత్రీకరణ జరుపుకోనున్న చిత్రం ఇదే అంటూ పృథ్విరాజ్ ప్రకటించారు.
ఇటీవల క్రేజీ సంగీత దర్శకుడు తమన్ అమెరికాలో 'అల అమెరికాపురములో' అనే మ్యూజిక్ ప్రోగ్రాం నిర్వహించారు. ఆహా సంస్థ ఈ ఈవెంట్ ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ ప్రోమోని వర్చువల్ ప్రొడక్షన్ ఎల్ఈడీ స్క్రీన్స్ తోనే చిత్రీకరించడం విశేషం.
ఇదే సరైన సమయం
కరోనా లాంటి పాండమిక్ సమయంలో దూరప్రాంత లొకేషన్స్ కి చిత్ర యూనిట్ ప్రయాణించడం సాధ్యం కాదు. పైగా వర్చువల్ ప్రొడక్షన్.. నిర్మాతకు ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గిస్తుంది. భారీ స్థాయిలో తెరకెక్కే చిత్రాలకు ఈ కొత్త టెక్నాలజీ ఎంతో ఉపయోగకరం. సో.. ఇండియన్ ఫిలిం మేకర్స్ అంతా ఈ న్యూ జనరేషన్ ఫిలిం మేకింగ్ విధానంపై సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com