కరోనా కాదు.. కుల క్వారంటైన్ సెంటర్లు.. ఏపీలో నయా ట్రెండ్..
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సమయంలో.. అసలే ఎవరినీ అంటీ ముట్టకూడదంటే.. కులంగాని కులం వారితో కలిసుండాల్సిన దుస్థితి ఏంటి అనుకున్నారో ఏమోగానీ నయా ట్రెండ్‌కి తెరదీశారు. ఇది ఎక్కడో కాదు.. తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకునే ఏపీలో.. నవ్విపోదురు గాక అనుకున్నా సరే.. వెనక్కి తగ్గేదే లేదు. కుల సంఘాలతో కలిసి ప్రత్యేక క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. మరి వైద్యులు వారి కులానికి చెందిన వారే వైద్యం అందిస్తున్నారో లేదో కానీ బలమైన సామాజిక వర్గాలు అవలంబిస్తున్న వింత పోకడ ఇది. ప్రభుత్వం.. ప్రతిపక్షమే రెండు సామాజిక వర్గాలుగా విడిపోయి నిందారోపణలు చేసుకుంటుంటే సామాన్య ప్రజలు ఊరుకుంటారా..? కరోనా టైంలో క్వారంటైన్ సెంటర్లను సైతం కులాల వారీగా నెలకొల్పారు.
అసలే తెలంగాణతో పోలిస్తే ఏపీలో కుల ప్రభావం చాలా ఎక్కువ. దీంతో కమ్మ క్వారంటైన్ సెంటర్.. రెడ్డి క్వారంటైన్ సెంటర్.. కాపు, వైశ్య, రాజు అంటూ క్వారంటైన్ సెంటర్లు వెలిశాయి. అన్నట్టు ఇది ఇక్కడ మొదలైన ట్రెండ్ కాదు.. ఈ ట్రెండ్ సెట్టర్స్ ఉత్తరాది వారు.. అక్కడ బలమైన సామాజిక వర్గాలుగా పిలవబడే అగర్వాల్స్, జైన్స్ తదితరులు. ఈ ట్రెండ్‌ను మన ఏపీ వాళ్లు ఫాలో అవుతున్నారు అంతే. ఇవన్నీ అనధికారికంగానే నడుస్తున్నాయి. అయినా ప్రభుత్వానికి ఇదేమీ తెలియదంటే మాత్రం పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగిన సామెతను గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది.
ప్రభుత్వం నుంచి అన్ని సౌకర్యాలు లేకపోవడం.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులను భరించలేకపోవడం వంటి అంశాలు ప్రజలను ఈ కుల క్వారంటైన్ల వైపు నడిపించాయని టాక్. అయితే దీనిని నిర్వాహకులు అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలోనే సమర్థించుకుంటున్నారు. అందరికీ సాయం చేసేంత ఆర్థిక స్తోమత తమకు లేదని.. కాబట్టి కనీసం తమ కులస్తులకైనా సాయం చేయాలనిపించి ఈ క్వారంటైన్ సెంటర్లను నిర్వహిస్తున్నాం తప్ప కులతత్వాన్ని ప్రోత్సహించడం తమ ఉద్దేశం కాదనేది నిర్వాహకుల వాదన. ఏది ఏమైనా కరోనా సమయంలో ఒకరికొకరు తోడుండాల్సింది పోయి.. కులాల వారీగా చీలిపోవడమేంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments