Hyderabad New Traffic Restrictions: ‘‘గీత’’ దాటితే ఫైనే... హైదరాబాద్‌లో కొత్త ట్రాఫిక్ రూల్స్, బీ అలర్ట్
- IndiaGlitz, [Saturday,October 01 2022]
హైదరాబాద్ నగరంలో ఇకపై అడ్డదిడ్డంగా వాహనాలు నడిపివారికి, ఏ మాత్రం రూల్స్ పాటించని వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఇప్పటిదాకా లైసెన్స్ లేకున్నా, హెల్మెట్ లేకున్నా, కారులో సీటు బెల్ట్ పెట్టుకోకున్నా, మితి మీరిన వేగంతో నడిపినా, నో పార్కింగ్ జోన్లో వాహనాలు పార్క్ చేసినా... జరిమానాలు విధించిన ట్రాఫిక్ పోలీసులు ఇకపై సరికొత్త నిబంధనలు అమలులోకి తీసుకురానున్నారు. నగరంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు, ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడేవారికి చెక్ పెట్టేందుకు ట్రాఫిక్ విభాగంగా కఠినమైన నిబంధనల్ని అమల్లోకి తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. అంతేకాదు భారీగా జరిమానాలను కూడా విధించనున్నారు అధికారులు.
అక్టోబర్ 3 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు:
దీని ప్రకారం... ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద స్టాప్‌లైన్ దాటితే రూ.వంద.. ఫ్రీ లెఫ్ట్‌కు ఆటంకం కలిగేలా వాహనదారులు వ్యవహరిస్తే రూ.వెయ్యి జరిమానా విధించనున్నారు. అలాగే ఫుట్‌పాత్‌లపై దుకాణదారులు ఆక్రమించినా భారీ జరిమానా విధిస్తారు. పాదచారులు నడిచేందుకు ఆటంకం కలిగేలా వాహనాలు పార్క్ చేస్తే రూ. 600 ఫైన్ విధిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమీషనర్ మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలు పాటించని వారికి జరిమానాలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు నిబంధనలు పాటించి సహకరించాలని.. అక్టోబర్ 3 నుంచి కొత్త నిబంధనలు అమలు ఆయన స్పష్టం చేశారు.
‘ఆపరేషన్ రోప్’కి శ్రీకారం చుట్టిన పోలీస్ శాఖ:
ఇకపోతే.. ఒక నివేదిక ప్రకారం హైదరాబాద్ రోడ్లపై ప్రతినిత్యం దాదాపు 80 లక్షల వాహనాలు తిరుగుతున్నాయట. అందులో టూవీలర్సే దాదాపు 56 లక్షల వరకు వున్నాయట. అలాగే 14 లక్షల కార్లు ప్రతినిత్యం చక్కర్లు కొడుతున్నాయని అంచనా. ఇరుకైన రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, ఎక్కడిపడితే అక్కడ పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీని వల్ల ఉదయం, సాయంత్రం బిజీ వేళల్లో సిగ్నల్స్ వద్ద గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతోంది. దీనిలో భాగంగానే ‘‘ ఆపరేషన్ రోప్’’ అనే భారీ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తామని కొద్దిరోజుల క్రిందట హైదరాబాద్ నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ తెలియజేశారు. ఈ క్రమంలోనే జరిమానాలకు సంబంధించిన వివరాలను నగర పోలీసులు వెల్లడించారు.