హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేశారో...
- IndiaGlitz, [Thursday,November 05 2020]
మోటార్ వెహికల్ చట్టం 206కి కేంద్రం మార్పులు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలోనే మార్గదర్శకాలను సైతం విడుదల చేసింది. కాగా.. వీటిని కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే.. హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే వీటిని అమలు చేస్తున్నారు. ఇక మీదట ఈ రూల్స్‌ను ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించనున్నారు. ఇక మీదట హైదరాబాద్ వాసులెవరైనా సరే హెల్మెట్ ధరించకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డారో ఇక అంతే సంగతులు.
హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ మొదటి సారి పట్టుబడితే మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌పై సస్పెన్షన్ విధిస్తారు. రెండోసారి హెల్మెట్ లేకుండా పట్టుబడితే లైసెన్స్‌ను జీవితకాలం రద్దు చేస్తారు. ఇక ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్‌లకు సైతం ఇవే నిబంధనలు వర్తించనున్నాయి. నిబంధనలకు అనుగుణంగా డ్రైవింగ్ చేస్తేనే సురక్షితంగా.. ఎలాంటి ఫైన్లు లేకుండా ఇంటికి చేరుకోవచ్చు. లేదంటే లైసెన్స్ రద్దవడంతో పాటు జేబు కూడా ఖాళీ అవుతుంది.
మనం చేసే చిన్న చిన్న తప్పిదాల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టాన్ని నివారించడంలో భాగంగా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ఇక మీదట గమ్యం దగ్గరేననో.. మరే కారణం వల్లనో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ఇబ్బందులు మాత్రం తప్పవు. తస్మాత్ జాగ్రత్త.