కరోనా నియంత్రణకు నూతన మార్గదర్శకాల విడుదల...
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైన నేపథ్యంలో దాని నియంత్రణకు కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు డిసెంబర్ 1 నుంచి 31 వరకూ అమలులో ఉండనున్నాయి. కంటైన్‌మెంట్ జోన్లకు ఆవల ఆంక్షలు విధించాలని భావిస్తే కేంద్రం అనుమతిని తప్పనిసరి చేసింది. కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా సూక్ష్మ స్థాయిలో మాత్రమే కంటైన్‌మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలి. అలాగే వాటి వివరాలను ఆయా జిల్లాల కలెక్టర్లు వెబ్‌సైట్‌లో పొందుపరచాలని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అలాగే ఆ సమాచారాన్ని కేంద్ర వైద్య శాఖకు ఎప్పటికప్పుడు అందించాలని తెలిపింది.
రోజువారీ అవసరాలు మినహా కంటైన్‌మెంట్ జోన్లలో ప్రజలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించాలని సూచించింది. పాజిటివ్ వస్తే 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచాలని స్పష్టం చేసింది. జిల్లా అధికారులు, పోలీసులు, మునిసిపల్ అధికారులు కరోనా నియంత్రణ చర్యల అమలును పర్యవేక్షించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఆయా అధికారులను జవాబుదారీగా ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రజలు మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవడంతో పాటు భౌతిక దూరం పాటించేలా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించింది.
మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధించే అవకాశాన్ని రాష్ట్రాలు పరిశీలించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. కరోనా నియంత్రణకు జారీ చేసిన జాతీయ మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అంతర్జాతీయ ప్రయాణాలు, స్విమ్మింగ్ పూల్స్, ఎగ్జిబిషన్ హాళ్లపై నిషేధం కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. సామాజిక, మతపరమైన, సాంస్కృతిక కేంద్రాలు, సినిమా థియేటర్లు 50 శాతం సామర్థ్యంతో కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. వీటిపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించే అవకాశం రాష్ట్రాలకు ఉంటుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments