అకౌంట్‌లోని డబ్బు ఇలా కూడా లేపేస్తారా?.. నయా మోసం వెలుగులోకి..
Send us your feedback to audioarticles@vaarta.com
డబ్బు కొట్టేయడంలో ఇద్దరు విద్యార్థులు వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఇద్దరు సీఏ విద్యార్థులు చేసిన పని.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆధార్ డేటాను వినియోగించి.. ఖాతాదారులకు తెలియకుండా వారి ఖాతా నుంచి సొమ్ము కాజేశారు. బాధితుడికి కాల్ చేయలేదు.. ఓటీపీ అడగలేదు.. సీవీవీ జోలికి కూడా వెళ్లలేదు. పైగా డెబిట్/క్రెడిట్ కార్డు నంబరుతో పని లేకుండా ఓ ఖాతాదారుడి ఖాతా నుంచి రూ.10 వేలు లేపేశారు. దీంతో బాధితుడు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఐపీ చిరునామా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు షాక్ అయ్యారు. కారణం.. ఆ డబ్బు కాజేసింది.. ఇద్దరు సీఏ విద్యార్థులు కావడం. వెంటనే ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
నిందితులను ఇలా గుర్తించారు..
హైదరాబాద్‌లోని మధురానగర్‌కు చెందిన సిద్దిరెడ్డి వీర వెంకట సత్యనారాయణ మూర్తికి.. పశ్చిమ గోదావరి జిల్లా ఆనపర్తి ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉంది. ఈ నెల 22న ఆయన ఖాతా నుంచి రూ.10 వేలు విత్‌డ్రా అయినట్లు ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఇంట్లో వారిని వాకబు చేయగా తమకు తెలియదని చెప్పారు. దీంతో తన డబ్బును ఎవరో కాజేశారని అనుమానించిన సత్యనారాయణ మూర్తి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే విచారణ ప్రారంభించిన పోలీసులు.. నగదు విత్‌డ్రా అయిన పే పాయింట్ కేంద్రం ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను గుర్తించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు సీఏ విద్యార్థులు విశాల్, అర్షద్ ఈ పని చేసినట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వెబ్‌సైట్ నుంచి వివరాలు సేకరించి సత్యనారాయణమూర్తి ఖాతా నుంచి 10 వేలు డ్రా చేసినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు.
డబ్బును ఇలా కాజేశారు..
ఏపీలోని రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను సెర్చ్ చేసిన నిందితులు భూములకు సంబంధించిన పత్రాలను డౌన్ లోడ్ చేశారు. వాటి నుంచి సత్యనారాయణ మూర్తి ఆధార్‌కార్డు నంబర్‌ను, అతని వేలి ముద్రలను సేకరించారు. అనంతరం సత్యనారాయణ మూర్తి వేలిముద్రలను కాపీ చేసిన విశాల్, అర్షద్.. ఆ నకిలీ ముద్రల సాయంతో పేపాయింట్‌లో లాగిన్ అయ్యారు. ఆ యాప్ ద్వారా డబ్బును దొంగిలించినట్టు నిందితులు వెల్లడించారు. అయితే వీరిద్దరికీ మరో వ్యక్తి కూడా సహకరించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అతని ద్వారానే సత్యనారాయణ మూర్తి ఖాతా ఏ బ్యాంకులో ఉందో తెలుసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా.. వేలిముద్రల ఆధారంగా డబ్బు కొట్టేయడం అంత సులువేమీ కాదని.. దీని గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్సార్ నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ అజయ్‌కుమార్ వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments