ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాట్సాప్ ఫీచర్ వచ్చేసింది..

  • IndiaGlitz, [Saturday,November 21 2020]

వాట్సాప్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ భారీగా పెరిగిపోతోంది. దీంతో వినియోగదారులకు అందుబాటులో ఉండేలా వాట్సాప్ కూడా సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇప్పటికే వాట్సాప్ వినియోగదారుల భద్రత కోసం ఫింగర్ ప్రింట్ ఆప్షన్‌ను తీసుకొచ్చిన వాట్సాప్.. మరో అదిరిపోయే ఆప్షన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ ఆప్షన్‌ను అమల్లోకి తీసుకురానున్నట్టు గతంలోనే ప్రకటించినప్పటికీ తాజాగా ఇది కార్యరూపం దాల్సింది. మొదట్లో మనకు వాట్సాప్ నుంచి పంపించిన మెసేజ్‌ను డిలీట్ చేసే అవకాశమే లేదు. దీనిని వాట్సాప్ ఆ తరువాత అధిగమించింది. అయితే దానిలోనూ ఓ డ్రా బ్యాక్ ఉంది.

ఇప్పటి వరకూ మనం అవతలి వ్యక్తికి పంపిన వాట్సాప్ టెక్ట్స్, ఫోటో, ఎమోజీ, వీడియోలను నిర్ణీత కాలంలో మాత్రమే డిలీట్ చేసే అవకాశం ఉంది. ఆ సమయం దాటిందంటే వాటిని డిలీట్ చేయడం కుదరదు. అయితే వాట్సాప్ ఈ అవరోధాన్ని సైతం తాజాగా అధిగమించింది. ఈ మేరకు సెల్ఫ్ డిస్ట్రెక్టింగ్ ఆప్షన్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ ఆప్షన్ కారణంగా మనం అవతలి వాళ్లకు పంపించిన మెసేజ్ ఎప్పుడు డిలీట్ చేయాలనేది మన చేతుల్లోనే ఉంటుంది. దీనికోసం సెండ్ బటన్ పక్కన టైమర్‌ను అందుబాటులోకి వాట్సాప్ తీసుకు వచ్చింది.

వాట్సాప్‌ చాట్‌ని ఓపెన్ చేసి కాంటాక్ట్ ఇన్ఫోని ట్యాప్ చేసి.. స్క్రోల్ డౌన్ చేస్తే డిజప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ కనిపిస్తుంది. ఆ ఫీచర్‌ని క్లిక్ చేసి ఆఫ్ బటన్ నొక్కితే చాలు. వారం రోజుల తర్వాత మనం చేసిన మెసేజ్ కనిపించకుండా పోతుంది. మనం మెసేజ్, ఫోటో, ఎమోజీ, వీడియో ఏదైనా సరే అవతలి వ్యక్తికి సెండ్ చెయ్యడానికి ముందు టైమర్‌లో టైమ్‌ను సెట్ చేసుకుని ఆ తరువాత సెండ్ బటన్ నొక్కాలి. దీంతో అవతలి వ్యక్తి ఫోన్ నుంచి మనం పంపిన సమాచారం టైమర్‌లో సెట్ చేసిన సమయం అవగానే డిసప్పియర్ అవుతుంది. గతంలోనే ఈ ఫీచర్‌ను ప్రకటించింది. దీంతో ఎప్పటి నుంచో వినియోగదారులు ఈ ఫీచర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఇప్పటికి ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.