ఏపీ రాజధానిపై సరికొత్త వాదన.. గ్రేటర్ రాయలసీమ!
- IndiaGlitz, [Wednesday,December 25 2019]
ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చేమోనని అసెంబ్లీ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనతో అటు రాయలసీమలో.. ఇటు అమరావతిలో ఆందోళన నెలకొంది. సీమ వాసులు మాత్రం హైకోర్టు ఒక్కటే ఇస్తే ఏం ఫలితమని.. అమరావతి వాసులు మాత్రం రాజధాని తరలించే ప్రసక్తే లేదని రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో సరికొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రాయలసీమకు హైకోర్టుకు ఇస్తే ఏం ఫలితం..? రాజధానే కావాలంటూ సీమకు చెందిన కొందరు నేతలు సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. బుధవారం నాడు సీమ కీలక నేతలు మైసూరా రెడ్డి, శైలాజానాథ్, గంగుల ప్రతాప్‌రెడ్డి, దినేష్ రెడ్డితో పాటు పలువురు సీఎంకు లేఖలు రాసి.. గ్రేటర్ రాయలసీమను రాజధాని చేయాలని కోరారు. గతంలో ఐక్యత కోసం రాజధాని కర్నూలు ప్రాంతాన్ని సీమ ప్రజలు త్యాగం చేశారన్న విషయాన్ని ఈ సందర్బంగా మైసూరా గుర్తు చేశారు. సీమ ప్రజల త్యాగాలు వృథా కాకూడదదని అందుకే.. వికేంద్రీకరణను తాను సమర్థిస్తున్నట్లు మీడియా వేదికగా తెలిపారు.
మైసూరా వాదాన ఇదీ..!
మాకు న్యాయం జరగాలి. రాజధాని రాయలసీమ ప్రాంతలో రావాలి. రాజధాని ఇవ్వకుంటే మా ప్రాంతాన్ని మాకివ్వండి. మాకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వాలి. మేం ఏం ఆంధ్రా వాళ్లతో కలిసి అలింగనం చేసుకొని ఉంటామని అనట్లేదు. అమరావతి రైతులు చేసింది త్యాగం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం. అమరావతి రైతుల్ని మేం వ్యతిరేకించడం లేదు. కానీ రాజధాని విషయంలో రాయలసీమ ప్రజలు చేసింది మాత్రం త్యాగం. హైకోర్టు తరలించినప్పుడు కర్నూలులో ఏర్పాటు చేయాలని కొందరు న్యాయవాదులు, విద్యావంతులు మాత్రమే కొరారు. ఎప్పుడూ మేం మాత్రమే త్యాగం చేయాలా?. గ్రేటర్ రాయలసీమను సపరేట్ చేయాలి. కనీసం రాజధాని ఇవ్వాలనడం న్యాయసమ్మతమే. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కూడా రాయలసీమ వాసులు కాబట్టి వాళ్లు విజ్ఞతతో ఆలోచించి రాయలసీమపై నిర్ణయం తీసుకోవాలి. కేవలం లేఖ రాసి ఈ విషయాన్ని ఇక్కడతో వదిలిపెట్టం. ఏపీ కేబినెట్ రాజధానిపై నిర్ణయం తీసుకున్న తర్వాత మా భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. గ్రేటర్ రాయలసీమలో రాజధానిపై త్వరలో సమావేశాలు నిర్వహిస్తాం’ అని మైసూరా స్పష్టం చేశారు.
ఏం జరుగుతుందో!?
మొత్తానికి చూస్తే.. ప్రత్యేక రాయలసీమ కావాల్సిందేనని నేతలు పట్టుబడుతున్నారన్న మాట. ఈ నెల 27న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. అనంతరం ఈ మూడు రాజధానులు, ప్రత్యేక రాయలసీమ వ్యవహారంపై తేలిపోనుంది. అయితే.. 27న కేబినెట్లో ఏం జరుగుతుందా..? అనేదానిపై ఏపీ ప్రజల్లో.. మరీ ముఖ్యంగా అమరావతి రైతులు, సీమ వాసుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు.. కేబినెట్ సమావేశం తర్వాత రాజధానులపై ప్రకటన రానుంది. ఇప్పటికే ఏపీలోని అన్ని జిల్లాల నుంచి బెటాలియన్ అమరావతికి చేరుకుంది. ప్రకటన అనంతరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెటాలియన్ చేరుకుంది.