‘ఐ రిటైర్’ అంటూ షాక్ ఇచ్చిన బ్యాడ్మింటన్ స్టార్ సింధు..
Send us your feedback to audioarticles@vaarta.com
‘ఐ రిటైర్’అన్న ట్వీట్‌తో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ అభిమానులు షాక్‌కి గురి చేసింది. ఆమె రిటైర్ అవ్వడమేంటని ట్వీట్ చూసిన నెటిజన్లంతా షాక్ అయ్యారు. అయితే ఆమె పోస్టును పూర్తిగా చూసిన వారు మాత్రం పోస్టు సారాంశాన్ని అర్థం చేసుకుని.. నిజానికి ఆమె రిటైర్‌మెంట్ ప్రకటించలేదని తెలుసుకున్నారు. కరోనా మహమ్మారి గురించి సింధు ఆ పోస్ట్ పెట్టింది. కరోనా మహమ్మారి తన కళ్లు తెరిపించిందని పేర్కొంది. బ్యాడ్మింటన్‌లో ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు ఎంతగానో శ్రమించానని కానీ ప్రపంచాన్ని ఇబ్బందుల్లోకి నెట్టిన కంటికి కనిపించని కరోనా మహమ్మారిని ఓడించాలన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదని తెలిపింది. కొన్ని నెలలుగా బయటకు వెళ్లాలనుకున్నప్పుడల్లా మనల్ని మనమే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని సింధు తెలిపింది.
ఈ మహమ్మారి బారినపడిన వారు ఎదుర్కొన్న హృదయ విదారక కథనాలు చాలా చదివానని.. ఆ సమయంలో తనను తాను మరింతగా ప్రశ్నించుకున్నానని కానీ ఇప్పుడు ఆ ఆలోచనలన్నింటికీ రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నానని సింధు తెలిపింది. ఈ వైరస్ గురించిన అర్థం పర్థం లేని ఆలోచనలు, అపోహలు, భయాల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటిస్తున్నట్టు సింధు తెలిపింది. వైరస్‌ను ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని సూచించింది. ఏమాత్రం ధైర్యం కోల్పోకూడదని.. మనం తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్‌ను నిర్దేశిస్తుందని సింధు వెల్లడించింది.
అయితే తను చెప్పాలనుకున్న విషయాలు .. గతంలో ఎన్నడూ చూడని ఇలాంటి సమయం గురించి చెప్పేందుకే తాను ‘ఐ రిటైర్’ అనే మార్గాన్ని ఎంచుకున్నానని సింధు వెల్లడించింది. కరోనాపై అవగాహన కల్పించేందుకు ఇదే సరైన మార్గంగా భావించినట్టు ఆమె తెలిపింది. కాగా.. సింధు పోస్టుపై నెటిజన్లు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సింధు చెప్పిన విషయం సరి అయినదే అయినప్పటికీ.. ఆ విషయాన్ని వ్యక్తపరిచేందుకు ఎంచుకున్న మార్గం సరి అయినది కాదనేది కొందరి వాదన. దీంతో సింధు పెట్టిన పోస్టును కొందరు సమర్థిస్తుండగా.. మరికొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
— Pvsindhu (@Pvsindhu1) November 2, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments