Sabitha Indra Reddy:తెలంగాణకు స్కూళ్లకు రెండ్రోజులు సెలవులు.. ఇప్పుడే లేచారా, సబితమ్మను ఏకీపారేస్తున్న నెటిజన్లు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో గడిచిన రెండు రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పోటెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఆఫీసులకు వెళ్లే వారు , కూలీ పనులు చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పిల్లల ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో వుంచుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్విట్టర్‌లో వివరాలు తెలిపారు.
వర్షంలో స్కూల్‌కి వెళ్లి.. వర్షంలోనే ఇంటికొచ్చిన పిల్లలు :
అయితే ఈ నిర్ణయంపై నెటిజన్లు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పిల్లలు బడికి వెళ్లకముందే సెలవులు ప్రకటిస్తే బాగుండేది.. కానీ ప్రభుత్వం మాత్రం విద్యార్ధులు స్కూళ్లకు వెళ్లిపోయాక తీరిగ్గా సెలవులు ప్రకటించింది. భారీ వర్షంలోనూ తమ తిప్పలు తాము పడుతూ పిల్లలు బడికి వెళ్లారు. తీరా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో మళ్లీ అదే వర్షంలో పిల్లలు ఇంటికి చేరుకున్నారు. ఇది సరైన పద్ధతి కాదంటూ సబితా ఇంద్రారెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.
రెండ్రోజుల క్రితమే వాతావరణ శాఖ అలర్ట్ :
వాతావరణ శాఖ అధికారులు రెండ్రోజుల క్రితమే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. గురువారం నాటికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినా పట్టలేదంటూ దుయ్యబడుతున్నారు. పిల్లలంతా స్కూళ్లకు వెళ్లడానికి ముందు.. రెండ్రోజుల క్రితమే ఈ ప్రకటన చేస్తే బాగుండేదని వారు చురకలంటిస్తున్నారు. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుంటే ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదంటూ పేరెంట్స్ ఫైర్ అవుతున్నారు. అటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సైతం సబితా ఇంద్రారెడ్డిపై సెటైర్లు వేశారు. ‘‘పిల్లలు స్కూల్‌కి వెళ్లిన తర్వాత నిద్రలేచి విద్యాలయాలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ మంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు’’ అంటూ రఘునందన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments