రాజ‌మౌళికి రామాయ‌ణం చేయాలంటూ నెటిజ‌న్స్ రిక్వెస్ట్‌

ఓ సాధార‌ణ స‌న్నివేశాన్ని బ‌ల‌మైన ఎమోష‌న్స్‌, రోమాలు నిక్క‌బొడుచుకునే యాక్ష‌న్‌, అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో తెర‌కెక్కించే ద‌ర్శ‌కుల్లో దర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ముందు వ‌రుస‌లో ఉంటారు. ఇప్పుడు ఆయ‌న‌కు నెటిజ‌న్స్ నుండి ఆస‌క్తిక‌ర‌మైన రిక్వెస్ట్ వ‌చ్చింది. అదేంటో తెలుసా? రామాయాణాన్ని తెర‌కెక్కించాల‌నే విన‌తి. ఇంత‌కూ ఈ రిక్వెస్ట్ ఎందుకో వ‌చ్చిందనే వివ‌రాల్లోకెళ్తే.. రామానంద్ సాగ‌ర్ 1987లో రామాయణాన్ని సీరియ‌ల్‌గా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ స‌మ‌యంలో మ‌ళ్లీ ఈ సీరియ‌ల్‌ను పునఃప్రసారం చేస్తే ఎక్కువ మంది వీక్షించిన సీరియ‌ల్‌గా రామాయ‌ణం రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌లువురు రామాయ‌ణంను రాజ‌మౌళిని డైరెక్ట్ చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. రాజ‌మౌళి మేక్ రామాయ‌ణ్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్ట‌ర్‌లో ఈ రిక్వెస్ట్ నెంబ‌ర్ వ‌న్‌గా ట్రెండ్ అయ్యింది. ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ‘రౌద్రం ర‌ణం రుధిరం(ఆర్ఆర్ఆర్‌)’ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.