చావు బతుకుల్లో శివశంకర్ మాస్టర్: మీకంటే ధనుష్, సోనూసూద్‌లే నయం.. తెలుగు స్టార్స్‌పై నెటిజన్ల ఫైర్
Send us your feedback to audioarticles@vaarta.com
అప్పుడప్పుడు మన తెలుగు సినీ పరిశ్రమ విచిత్రంగా ప్రవర్తిస్తూ వుంటుంది. ప్రకృతి విపత్తులు, ఇతర అత్యవసర సమయాల్లో ఎంతో మందికి ఎన్నోసార్లు అండగా నిలబడ్డ ఘనత మన టాలీవుడ్‌ది. అంతేనా వ్యక్తిగతంగా కూడా అనాథలు, వృద్ధుల ఆలనాపాలనా చూడటంతో పాటు ఎంతోమంది చిన్నారులకు గుండె సర్జరీలు చేయించిన వారు మన ఇండస్ట్రీలో వున్నారు. అలాగే అభిమానులు కష్టాల్లో వున్నారని తెలిస్తే చాలు స్వయంగా వెళ్లి సాయం చేసిన ఘటనలు వున్నాయి. అలాంటిది తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్ధాలుగా పనిచేస్తూ.. ఎంతో మంది స్టార్స్‌కి ఆత్మీయుడిగా వున్న ఓ వ్యక్తి విషయంలో మాత్రం టాలీవుడ్ వర్గాలు స్పందించడం లేదు.
ఆయన ఎవరో కాదు.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్. కరోనా బారిన పడిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉందని అంటున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ పెద్దకుమారుడికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఆయనకు కూడా సీరియస్‌గా ఉందని.. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని సమాచారం.
ఇక శివ శంకర్ మాస్టర్ భార్య కూడా కరోనాతో హోమ్ క్వారెంటైన్లో ఉన్నారు. చిన్నకొడుకు అజయ్ కృష్ణ ఒక్కడే ప్రస్తుతం తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటున్నారు. కుటుంబం మొత్తం కరోనా బారిన పడడంతో రోజూవారి ఖర్చులకు అధిక మొత్తంలో అవుతుండటంతో.. అంత మొత్తం భరించే స్తోమత తమ వద్ద లేదని అంటున్నారు అజయ్ కృష్ణ. క్లిష్ట పరిస్దితుల్లో తమను ఆదుకోవాలని పరిశ్రమ పెద్దలను ఆయన కోరారు. ఈ విషయం తెలుసుకున్న నటుడు సోనూసూద్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అలాగే తమిళ స్టార్ హీరో ధనుష్ సైతం శివశంకర్ మాస్టర్ చికిత్స కోసం పదిలక్షల రూపాయలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే వీరిద్దరూ కూడా తెలుగు వారు కాదు. ఒకరు హిందీ వ్యక్తయితే, మరొకరు తమిళనాడు వాసి. కానీ తెలుగు రాష్ట్రంలో పుట్టిన ఓ కొరియోగ్రాఫర్‌కి తెలుగు సినీ పరిశ్రమ అండగా నిలవకపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. టాలీవుడ్లో ఎన్నో సూపర్‌హిట్ పాటలకు నృత్య దర్శకత్వం చేసిన శివశంకర్ మాస్టర్‌ను మనపెద్దలు పట్టించుకోకపోవడం దారుణమంటున్నారు. ధనుష్, సోనూసూద్‌లను చూసి టాలీవుడ్ హీరోలు నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments