ఈ కాపీ పేస్ట్‌లేంటి? మరోసారి ఈటలపై మండిపడ్డ నెటిజన్స్..
- IndiaGlitz, [Thursday,July 23 2020]
వైద్య ఆరోగ్యశాఖ బుధవారం విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో పెద్ద తప్పిదమే జరిగింది. దీనిపై నెటిజన్లు మరోసారి వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఈటల రాజేందర్‌పై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. బుధవారం విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో పై ఒక్క డేటును మాత్రం మార్చి కింద డేట్స్‌ను అలాగే ఉంచి కరోనా కేసులకు సంబంధించిన అంకెలను మాత్రం మార్చారు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ఎవరి తప్పిదమిది? దీనికెవరు బాధ్యులు? ఇది జులై 22 నాటి హెల్త్ బులిటెన్ కానీ టోటల్ డేటా జులై 21కి సంబంధించినది.. మిస్టరీ కాపీ పేస్ట్‌లో ఉంది. మన రాష్ట్రం ఎలా పని చేస్తోందో దీనిని బట్టి అర్థమవుతోంది’’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు.
మన హెల్త్ అఫీషియల్స్ కంటే బెటర్‌గా 10వ తరగతి విద్యార్థి దీనిని సక్రమంగా చేస్తాడు. ఇలా జరగడం ఇదేమీ తొలిసారి కాదు. ఇలాంటి తప్పిదాలను మన గవర్నమెంట్ ఎప్పటికీ సవరించుకోలేదు’’ అని మరొక నెటిజన్ ట్వీట్ చేశారు. ‘పాపం ఆయన తెలివి అలా సచ్చింది. ఎలాగూ ఇచ్చేవి దొంగ లెక్కలే కదా. డేట్ ఏముంటే ఏముంది? మన బతుకులు మారాలి కానీ’ అని ఇంకొకరు.. ‘సర్ కొంచెం చదువుకున్న కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెట్టుకోండి’’ అని మరొకరు ట్వీట్ చేశారు. కాగా.. వెంటనే తప్పిదాన్ని తెలుసుకున్న ఈటల.. ట్విట్టర్లో తప్పులను సవరించి ఫ్రెష్‌గా మరో బులిటెన్‌ను పోస్ట్ చేయడం గమనార్హం.