విశాఖ ఉక్కు పోరుకు మెగాస్టార్ మద్దతు.. తీవ్ర స్థాయిలో విమర్శలు
Send us your feedback to audioarticles@vaarta.com
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై టాలీవుడ్ తరుఫున మెగాస్టార్ చిరంజీవి స్పందించిన విషయం తెలిసిందే. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన తన గళం విప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నో త్యాగాలకు ప్రతీక అంటూ ట్విటర్ వేదికగా తన స్పందన తెలియజేశారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా కదలిరావాలని పిలుపునిచ్చారు. కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడలమీద ‘విశాఖ ఉక్కు సాధిస్తాం’ అనే నినాదాన్ని రాసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఇదే ఇప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలకు కారణమైంది.
నిజానికి విశాఖ ఉక్కు ఉద్యమం జరిగింది.. 1966-67లో అని.. అప్పుడు చిరు వయసు 11 ఏళ్లని.. మరి ఆ సమయంలో ఏ కాలేజీ గోడలపై బ్రష్ పెట్టి రాశారంటూ సోషల్ మీడియా గగ్గోలు పెడుతోంది. తాను నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ పట్టి కాలేజీ గోడలపై ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అంటూ రాశానని చిరు పేర్కొన్నారు. అయితే ఆయన నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివింది 1973-76లో అని సోషల్ మీడియాలో నెటిజన్లు చెబుతున్నారు. మెగా కాదు.. దగా స్టార్ అంటూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. అసలు ఆయన తన పోస్టులో ఏం పేర్కొన్నారంటే...
‘‘విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పరిరక్షణ కమిటీ చేస్తున్న పోరాటానికి నా మద్దతు ప్రకటిస్తున్నాను. ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా మోగిన ఆనాటి నినాదాలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. నర్సాపురం వైఎన్ఎం కాలేజీలో చదివే రోజుల్లో బ్రష్ చేతబట్టి గోడలమీద ‘విశాఖ ఉక్కు సాధిస్తాం’ అనే నినాదాన్ని రాశాం. హర్తాళ్లు, ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు చేశాం. దాదాపు 35 మంది పౌరులతో పాటు.. 9 ఏళ్ల బాలుడు కూడా ప్రాణార్పణ చేసిన ఆనాటి మహోద్యమ త్యాగాల ఫలితంగా సాకారమైన విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్ప్పత్తి ప్రారంభమైనప్పుడు అందరం సంబరాలు చేసుకున్నాం. అది ఆంధ్రుల హక్కుగా.. ఆంధ్రుల ఆత్మగౌర ప్రతీకగా భావించి సంతోషించాం. విశాఖ ఉక్కుకు దేశంలోనే ఓ ప్రత్యేకత, విశిష్టత ఉందని తెలిసి గర్వించాం.
విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇన్నేళ్లయినా క్యాప్టివ్ మైన్స్ కేటాయించకపోవడం.. అందువల్ల నష్టాలొస్తున్నాయనే సాకుతో ప్రైవేటు పరం చేయాలనుకోవడం సమంజసం కాదు. లక్షలాది మంది ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఆధారపడిన విశాఖ ఉక్కును ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే ప్రయత్నాలను కేంద్రం విరమించుకోవాలని కోరుతున్నా. ఉద్యోగస్తులు, కార్మికుల భవిష్యత్‌ను, ప్రజల మనోభావాలను గౌరవించి కేంద్రం ఈ నిర్ణయాన్ని పున: సమీక్షించుకోవాలి. విశాఖ ఉక్కును రక్షించుకోవడమే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన, న్యాయ సమ్మతమైన మక్కు. ఆ హక్కును ఉక్కు సంకల్పంతో కాపాడుకుందాం’’ అని చిరంజీవి ట్వీట్లో పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com