Download App

Nene Raju Nene Mantri Review

చిత్రం, నువ్వు నేను, జయం వంటి సూపర్‌డూపర్‌ హిట్స్‌ తర్వాత తేజకు అన్ని పరాజయాలే పలకరించాయి. తేజ సినిమా గురించి పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అలాంటి సమయంలో బాహుబలి, ఘాజీ వంటి హిట్స్‌ అందుకున్న రానా సినిమా అనగానే అందరూ కాస్తా ఆశ్చర్యపోయారు. అసలు రానాతో తేజ ఎలాంటి సినిమా చేస్తాడోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. దానికి తోడు 'నేనే రాజు నేనే మంత్రి' అనే టైటిల్‌, టీజర్స్‌, పోస్టర్స్‌, పొలిటికల్‌ డైలాగ్స్‌ అందరిలో ఆసక్తిని మరింత పెంచాయి. మరి తేజ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ఏం చెప్పాలనుకున్నాడు? రానా పొలిటికల్‌ లీడర్‌ పాత్రలో ఎలా మెప్పించాడు? అనే విషయాలను తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...

కథ:

జోగేంద్ర(రానా) అనంతపురం జిల్లాలోని కారైకూడి ప్రాంతంలో ప్రజలకు ధర్మ వడ్డీలకు డబ్బు అప్పు ఇస్తుంటాడు. జోగికి తన భార్య రాధ(కాజల్‌ అగర్వాల్‌) అంటే ప్రాణం. వీరికి పెళ్లైన మూడేళ్లకు రాధ గర్భవతి అవుతుంది. అయితే ఊరి సర్పంచ్‌(ప్రదీప్‌రావత్‌), భార్య కారణంగా రాధ తన గర్భాన్ని పొగొట్టుకుంటుంది. రాధకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పేస్తారు. రాధ కోరిక మేర జోగేంద్ర సర్పంచ్‌ కావాలనుకుంటాడు. కానీ ఆ ప్లేస్‌లో సర్పంచ్‌ అందుకు ఒప్పుకోడు కాబట్టి, జోగి తెలివిగా ప్లాన్‌ ప్రకారం ఓడిస్తాడు. పదవీపోయినందున తనను చంపడానికి వచ్చిన సర్పంచ్‌ను జోగి చంపేస్తాడు. సిఐ., ఎమ్మెల్యేల సహాయంతో కేసు తనపై రాకుండా చూసుకుంటాడు. తర్వాత తనను బ్లాక్‌మెయిల్‌ చేసిన సిఐ, ఎమ్మెల్యేలను తన దారి నుండి అడ్డు తప్పిస్తాడు జోగి. పథకం ప్రకారం ఎమ్మెల్యే అవుతాడు. అక్కడ నుండి జోగేంద్ర రాజకీయ చదరంగం ఆడటం మొదలు పెడతాడు. జోగేంద్రకు శివ(నవదీప్‌) కుడిభుజంలా అండగా నిలబడతాడు. మినిష్టర్‌ పదవి కోసం రాష్ట్ర హోం మినిష్టర్‌(అశుతోష్‌ రానా)ను పావుగా వాడుకుంటాడు. దాంతో హోం మినిష్టర్‌, జోగిపై కక్ష కడతాడు. అదే సమయంలో జోగేంద్ర అంటే ఫోకస్‌ టీవీ చానెల్‌ అధినేత దేవికారాణి మనసు పడుతుంది. రాధను వదిలేసి తనను పెళ్లి చేసుకోమని కోరుతుంది. కానీ అందుకు జోగి ఒప్పుకోడు. దాంతో దేవికా రాణి కూడా జోగిపై కక్ష పెంచుకుంటుంది. ఇంత మంది శత్రువుల మధ్య జోగి సీఎం అవుతాడా? రాధ కోసమే రాజకీయ చదరంగం ప్రారంభించిన జోగి చివరకు ఏం పొగొట్టుకుంటాడు? ఏం సాధిస్తాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష:

రానా పెర్‌ఫార్మెన్స్‌: రానా రెండు షేడ్స్‌లో కనపడతాడు. భార్య కోసం ఏమైనా చేసే పాజిటివ్‌ షేడ్‌ ఒకటైతే, పదవి కోసం దారి తప్పిన రాజకీయ నాయకుడుగా మరో షేడ్‌లో కనపడతాడు. ఈ పదవీ దాహంతో తన కుడిభుజమైనా శివ(నవదీప్‌)ను కూడా ముందు వెనుకా ఆలోచించకుండా చంపేస్తాడు. ఈ రెండు షేడ్స్‌ను రానా చక్కగా పోషించాడు. ముఖ్యంగా పొలిటికల్‌ గేమ్‌లో రానా హావభావాలు,లుక్‌ చాలా బావున్నాయి. అలాగే ప్రీ క్లైమాక్స్‌లో రాధ చనిపోయినప్పుడు, ఫస్టాఫ్‌లో బాధాకరమైన సన్నివేశంలో చక్కగా నటించాడు.

కాజల్‌ పెర్‌ఫార్మెన్స్‌: కాజల్‌ పెర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌ ఉండే పాత్రలో చక్కగా నటించింది. భర్త అంటే ప్రాణమిచ్చే భార్యగా, తన భర్త ఏం చేసినా అర్థముంటుందనే భార్యగా ఓ వైపు, భర్త తప్పటడుగు వేసేటప్పుడు హెచ్చరించే రాధగా మరోవైపు, చివరకు చనిపోయేటప్పుడు కూడా భర్త గురించి ఆలోచించే భార్యగా చక్కటి పెర్‌ఫార్మెన్స్‌ చేసింది.

నవదీప్‌: ఈ పాత్ర ఫస్టాప్‌కే పరిమితం. ఉన్నంతలో నవదీప్‌ తన పాత్రకు న్యాయం చేశాడు.

కేథ‌రిన్: త‌న ప్రేమ కోసం ఏమైనా చేయ‌డానికి వెనుకాడ‌ని త‌త్వ‌మున్న‌టీవీ ఛానెల్ అధినేత దేవికారాణి పాత్ర‌లో స్టైలిష్‌గా న‌టించింది.

అశుతోష్‌ రానా: విలన్‌గా అశుతోష్‌ నటన చాలా బావుంది. రాజకీయ నాయకుడు ఎలా ఆలోచిస్తాడు అనే దాన్ని తన హావభావాలతో చక్కగా పలికించాడు.

పోసాని: సినిమాలో హీరోను చంపాలనుకునే పాత్ర, అలాగని సీరియస్‌గా ఉండదు. తనదైన బాడీ లాంగ్వేజ్‌తో పోసాని నవ్వించాడు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్‌లో పోసాని చెప్పే సంభాషణలు ఆడియెన్స్‌ను అలరిస్తాయి.

మిగిలిన పాత్రధారులు ప్రదీప్‌రావత్‌, సత్య ప్రకాష్‌, నవీన్‌, ప్రదీప్‌రావత్‌, శివాజీ రాజా, బిత్తిరిసత్తి, జయప్రకాష్‌రెడ్డి తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నిషియన్స్‌ పనితీరు:

దర్శకత్వం: ప్రేమకథలతో సక్సెస్‌లు అందుకున్న దర్శకుడు తేజ ఈసారి రూట్‌ మార్చి పొలిటికల్‌ జోనర్‌లో చేసిన సినిమా. కథలోని క్యారెక్టర్స్‌ను ఎక్కడా కన్‌ఫ్యూజన్‌ లేకుండా రాసుకున్నారు. అలాగే తెరకెక్కించాడు దర్శకుడు తేజ. అయితే హీరో సింపతీ ఫ్యాక్టర్‌తో సీఎం కావడం అనేది ఊహకు చాలా దూరంగా ఉంది. ఇక సీఎం కావడం కోసం హీరో ఆడే పొలిటికల్‌ గేమ్‌, ప్రత్యర్థుల చేతిలో మోసపోవడం వారిని దెబ్బ కొట్టడం వంటి విషయాలను చక్కగానే ప్రెజంట్‌ చేశారు.

సంగీతం: జోగేంద్ర టైటిల్‌ సాంగ్‌, నువ్వే నువ్వే ...సహా అన్ని మాంటేజ్‌ సాంగ్సే. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఓకే.

సినిమాటోగ్రఫీ: వెంకట్‌ సి.దిలీప్‌ కెమెరా వర్క్‌ బావుంది.

కామెడి, సంభాషణలు: పోసాని కృష్ణమురళి తనదైన శైలిలో చెప్పే సెటైరికల్‌ డైలాగ్స్‌, వాడు జోగేంద్ర..అంటూ మరోవైపు ప్రభాస్‌ శ్రీను, దూరదర్శన్‌ కెమెరామెన్‌గా బిత్తిరి సత్తి తనదైన యాసతో, మరోవైపు సెంట్రల్‌ జైలు సూపరిడెంట్‌ పాత్రలో జయప్రకాష్‌ రెడ్డిలు తమదైనన రీతిలో కామెడితో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. లక్ష్మీభూపాల్‌ మాటలు సినిమాకు ప్లస్‌ అయ్యాయి. పదవుల్లో ఉన్నవాళ్లే బాగుంటారు. పక్కనుండేవాళ్లు బాగుండరు. అన్న వస్త్రాలు కావాలంటే ఉన్న వస్త్రాలు పోతాయి, రానా సందర్భానుసారం చెప్పే సామెతలు. వంద మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి హోటల్‌లో పెడితే నేను అవుతాను సీఎం...శత్రువు కూడా పాఠాలు నేర్పుతాడని తెలిసింది..ఇలాంటి డైలాగ్స్‌ మెప్పిస్తాయి. వీటితో పాటు క్ల్రైమాక్స్‌లో జనం ఎవరికి ఓటేస్తుంటారు. ఎలా మోసపోతుంటారు. ప్రజల గురించి చాలా మంది రాజకీయ నాయకులు ఎలా ఆలోచిస్తారు. అసలు సానుభూతి ఓట్లు వేయడం, వారసత్వ రాజకీయాలు మీద ఇలా అన్నింటిపై వచ్చే సంభాషణలు అలరిస్తాయి.

మైన‌స్ పాయింట్స్: పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమ‌క‌థ. అయితే పొలిటిక‌ల్ ఎలిమెంట్స్ బాగా ద‌ట్టించారు. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలను అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తాయ‌ని చెప్ప‌లేం. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను ఆద‌రించే ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా పెద్ద‌గా న‌చ్చ‌క‌పోవ‌చ్చు.

బోటమ్‌ లైన్‌: జోగేంద్ర వేసే ప్రతి అడుగు రాధ కోసమే

Nene Raju Nene Mantri Movie Review in English

Rating : 3.0 / 5.0