Nela Ticket Review
సినిమాల విషయంలో కొన్ని కాంబినేషన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతుంటాయి. అలాంటి కాంబినేషన్స్‌లో హీరో రవితేజ... దర్శకుడు కల్యాణ్‌కృష్ణ కాంబో ఒకటి. ఎందుకంటే రవితేజ మాస్ ఇమేజ్ ఉన్న హీరో.. కల్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేసిన రెండు సినిమాలు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్. మరి వీరి కలయికలో సినిమా అంటే ఎలా ఉంటుందోనని ఆసక్తి. ఒక పక్కా మాస్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేస్తూ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కిన సినిమాయే `నేల టిక్కెట్టు`. మరి ఈ చిత్రం రవితేజ స్లైల్లో మాస్‌గానూ.. కల్యాణ్ కృష్ణ స్టైల్లో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉందా? లేదా? అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
అనాథగా పెరిగిన నేల టిక్కెట్(రవితేజ)కి మనుషులను కలుపుకు పోవడం ఇష్టం. చుట్టూ జనం.. మధ్యలో మనం అనే సిద్ధాంతాన్ని బాగా నమ్మే వ్యక్తి. హైదరాబాద్ వచ్చిన తర్వాత తన చుట్టు పక్కల ఉన్నవారికి సహాయపడటంతో అందరికీ దగ్గరవుతాడు. సహాయం అడిగిన వారికి తనకు వీలైనంత సహాయం చేస్తుంటాడు. ఓ సందర్భంలో హోం మినిష్టర్ అజయ్ భూపతి(జగపతిబాబు) మనుషులతో గొడవ పడతాడు. అజయ్ భూపతి.. తన నాన్న ఆనంద భూపతి(శరత్ బాబు) మంచి తనంతో మినిష్టర్ స్థాయికి ఎదుగుతాడు. టెర్రరిస్ట్ ఏటాక్‌లో తండ్రిని కోల్పోయిన అజయ్ భూపతికి తన తండ్రిది హత్య అని తెలుస్తుంది. అదే సమయంలో నేల టిక్కెట్‌తో గొడవలు జరుగుతాయి. తనను నేల టికెట్ కావాలనే టార్గెట్ చేశాడనే సంగతి హోం మినిష్టర్‌కి తెలుస్తుంది. ఇంతకు ఇద్దరి మధ్య గొడవేంటి? అసలు ఆనంద భూపతిని చంపిందెవరు? మెడికల్ స్టూడెంట్ మాళవికకు, నేల టికెట్ ఎలా పరిచయం అవుతాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే?
ప్లస్ పాయింట్స్:
- రవితేజ నటన
- కొన్ని డైలాగ్స్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్:
- కథ, కథనాలు
- సంగీతం, నేపథ్య సంగీతం
- ఎమోషన్స్ కనెక్ట్ కాకపోవడం
సమీక్ష:
రవితేజ నటన ఎప్పటిలాగానే ఎనర్జిటిక్‌గా ఉంది. వయసు పెరుగుతున్నా.. మాస్ మహారాజా స్పీడు మాత్రం తగ్గడం లేదు. ఇక ఈ సినిమాలో మరో మెయిన్ క్యారెక్టర్ విలన్‌గా చేసిన జగపతిబాబు.. చాలా సులభంగా చేసేశాడు. జగపతిబాబు కష్టపడి చేసేంత క్యారెక్టర్ కాదు. కానీ చివర్లో మళ్లీ పెద్ద విలన్ చిన్న మాటతో మంచివాడుగా మారిపోవడం అనేది కామన్‌గా కనపడే కమర్షియల్ సినిమా కాన్సెప్ట్‌లా అనిపించింది. ఇక హీరోయిన్ మాళవిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పెర్‌ఫార్‌మెన్స్‌కు స్కోప్ లేని పాత్ర.. పాటలకే పరిమితమైంది. ఇక సంపత్ రాజ్, పోసాని, రఘుబాబు, బ్రహ్మానందం, పృథ్వీ, అలీ, సురేఖావాణి, సుబ్బరాజు, ఎల్.బి.శ్రీరాం, శివాజీరాజా ఇలా పెద్ద క్యాస్టింగే సినిమాలో ఉన్నా.. అన్నీ ఇలా కనపడి అలా వెళ్లిపోయే క్యారెక్టర్స్ అయ్యాయి. ఇక సినిమా కాన్సెప్ట్ చుట్టూ జనం మధ్యలో మనం అనుకునే హీరో క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది. విలన్ కబ్జాలు, హత్యలు చేయించడం హీరో వాటికి ఎదురు తిరగడం.. హీరో, విలన్ మధ్య ఉన్న వార్ ఇంటర్వెల్‌లోనే తెలియడం.. ఇంటర్వెల్ నుండి ఇద్దరి మధ్య పోరు జరగడం తరహా కథలతో రూపొందిన సినిమాలను ఎప్పటి నుండో చూసేశారు తెలుగు ప్రేక్షకులు.
సినిమాలో దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌గా చుట్టూ జనం మధ్యలో మనం అనేది బావుంది కానీ, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు మాత్రం పేలవంగా ఉన్నాయి. బోలెడన్ని సన్నివేశాలు, ఒక్కో సన్నివేశంలోనూ ఫ్రేమ్ నిండా మనుషులు.. దేన్ని ఎందుకు చూస్తున్నామో, ఏది ఎక్కడ ఎందుకు వస్తుందో కూడా అర్థం కానట్టుగా కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. బ్రహ్మానందం వంటి సీనియర్ కమెడియన్‌కి డైలాగ్సేలేవంటే పాత్రలకు ఉన్న ప్రాముఖ్యత అర్థం చేసుకోవచ్చు. కొన్ని సీన్స్ నేలటిక్కెట్‌గాళ్లు నేలను నాకించేస్తారు వంటి మాస్ డైలాగ్స్.. కొన్ని డైలాగ్స్ మెప్పిస్తాయంతే. డైరెక్టర్ అండ్ టీం రవితేజను ఇంకా బెటర్‌గా వాడుకోలేదనిపించింది. అలీ, పృథ్వీ కామెడీ నవ్వించదు సరికదా! అనవరసరమేమో అనిపిస్తుంది. ఒక రాష్ట్రానికి హోం మినిష్టర్‌ని ఓ సాధారణ పౌరుడు అలా భయపెట్టేస్తుంటాడు. కానీ ఓ ఐపీఎస్ ఆఫీసర్ ఏమీ చేతకానీ వాడిలా చూస్తుంటాడు. ఇక క్లైమాక్స్‌లో ప్రస్తుత రాజకీయాలకు దగ్గరగా.. ఎమ్మెల్యేలను బహిరంగంగా కోనుగోలు చేసే సన్నివేశం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎమ్మెల్యేలను కొనేయడం ఇంత తేలికా... ఎవరు పిలిచినా వాళ్లు వెళ్లిపోతారా? అన్నట్టే అనిపిస్తుంది. రవితేజ అభిమానులు ఓ సారి సినిమాను చూస్తారంతే.
బోటమ్ లైన్: నేలటిక్కెట్టు. . రొటీన్ కానీ.. ఎంటర్ టైనింగ్ కాదు..
Nela Ticket Movie Review in English
- Read in English